జల్సాలకు అలవాటుపడి చోరీ చేస్తున్న యువకుడి అరెస్ట్

జల్సాలకు అలవాటుపడి విలాసవంతమైన జీవితం అనుభవించాలనుకున్నాడు.. ఎలాంటి మార్గంలోనైనా డబ్బు సంపాదించాలని దురాశకు పోయి కటకటాలపాలయ్యాడు. వృత్తిపరంగా ఆటోడ్రైవరయిన ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్న కొత్తగూడెం త్రీటౌన్ పోలీసులు సదరు నిందితుడిని ఇవాళ మీడియా ముందు ప్రవేశ పెట్టారు. డీఎస్పీ ఎస్ఎం అలీ విలేకర్లకు వివరాలు వెల్లడించారు. కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్ సిబ్బంది కొత్తగూడెంలోని మేదరబస్తీలో ఇవాళ ఉదయం వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ ఆటోడ్రైవర్ పోలీసులను గమనించి ఆటో వెనక్కి తిప్పి వెళ్తుండగా అప్రమత్తమైన పోలీసులు అడ్డుపడి వాహనాన్ని ఆపారు. సదరు వ్యక్తిని పట్టణంలోని రైతుబజార్ ఏరియాకి చెందిన ఎండీ అక్రమ్‌గా గుర్తించారు. విచారణలో సదరు వ్యక్తి పలు చోరీ కేసుల్లో నిందితుడని తెలిసింది. అతని వద్ద నుంచి పోలీసులు ఎలాంటి పత్రాలు లేని ఆటోను స్వాధీనం చేసుకున్నారు. అంతే కాకుండా రూ.5.6 లక్షల నగదు, 28 తులాల వెండి, బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. నిందితుడిపై చోరీ ఘటనల నేపథ్యంలో పలు కేసులు దాఖలు అయ్యాయని తెలిపారు.

సదరు నిందితుడిపై పీడీ యాక్టు కింద కేసు పెట్టేందుకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపినట్లు డీఎస్పీ అలీ తెలిపారు. సమావేశంలో ఇన్‌స్పెక్టర్లు ఆదినారాయణ, కరుణాకర్, ఎస్సై శ్రీనివాసరావు, ఏఎస్సై రామయ్య పాల్గొన్నారు.

2,405 total views, 54 views today