24 గంటల్లో 50,000 ఉద్యోగాలను సృష్టిస్తాం..

కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే దేశంలో 50,000 ఉద్యోగాలను సృష్టిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో తన సొంత నియోజకవర్గం అమేథీలో పర్యటిస్తున్న ఆయన.. ఈ సందర్భంగా తమ పార్టీ నేతలు, కార్యకర్తలతో మాట్లాడారు. ఎన్డీఏ సర్కారుపై విమర్శలు గుప్పించారు. ‘ నేను ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రజలకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. యువత, రైతులు చాలా సమయాన్ని వృథా చేసుకున్నారు. భాజపా ప్రభుత్వం కొలువుదీరేలా చేశారు. ఆ ప్రభుత్వం వ్యవస్థను నాశనం చేస్తోంది. ఇప్పుడు వారిని గద్దెదించండి. ఆ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలుపుతాం’ అని వ్యాఖ్యానించారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లో బీఎస్పీ-ఎస్పీ కూటమి గురించి రాహుల్‌ స్పందిస్తూ… ‘మా మూడు పార్టీల భావజాలం ఒకటే. భాజపాను ఓడించడానికి వారితో కలిసే పనిచేయాలని అనుకుంటున్నాము. మాయావతి, అఖిలేశ్‌పై నాకు చాలా గౌరవం ఉంది. మా ముగ్గురి లక్ష్యం ఒక్కటే. కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. గత లోక్‌సభ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెరవేర్చలేదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మనం గెలిచి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన 24 గంటల్లో 50,000 ఉద్యోగాలను సృష్టిస్తాం. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన 10 రోజుల్లోపే రైతు రుణమాఫీ చేసింది. ప్రియాంక గాంధీ రాజకీయ ప్రవేశంతో ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహం వస్తుంది. ఈ రాష్ట్రంలో మన పార్టీ తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ నిర్ణయం తోడ్పడుతుంది. ఈ రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా ఉత్తర్‌ప్రదేశ్‌ తూర్పు ప్రాంతానికి చెందిన ఓ కాంగ్రెస్‌ నేత ఉంటారు’ అని వ్యాఖ్యానించారు.

2,429 total views, 61 views today