మారుతీ వేగనార్ లుక్ మారింది.. ఓ లుక్కేయండి

దేశీ దిగ్గజ వాహన తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా తాజాగా సరికొత్త వేగానార్‌‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర 4.19 లక్షల నుంచి ప్రారంభమౌతోంది. టాప్ వేరియంట్ ధర రూ.5.69 లక్షలు. ధరలన్నీ ఎక్స్‌షోరూమ్ ఢిల్లీవి.

వేగనార్‌లో వస్తున్న మూడో జనరేషన్ మోడల్ ఇది. మునపటి కార్లతో పోలిస్తే ఇది కొంచెం పెద్దగా ఉంది. డిజైన్ పరంగా చూస్తే గత కార్ల కన్నా ఇదే బాగుంది. ఇందులో రీడిజైన్ హెడ్‌ల్యాంప్స్, కొత్త బంపర్ వంటి ప్రత్యేకతలున్నాయి. కాగా మారుతీ సుజుకీ.. వేగనార్ మోడల్‌ను 1999లో మార్కెట్‌లోకి తీసుకువచ్చింది.

బాలెనో, స్వి‌ఫ్ట్ మోడళ్లు తయారయ్యే హార్ట్‌టెక్ ప్లాట్‌ఫామ్‌పైనే ఇప్పుడు వేగనార్ కూడా రూపొందింది. అందుకే కారు కొంచెం పెద్దగా కనిపిస్తోంది. విశాలమైన క్యాబిన్ ఉంటుంది. ఇది చాలా పాజిటివ్ అంశం.

కంపెనీ కొత్త వేగనార్‌లో డ్యాష్‌బోర్డ్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లను కూడా మార్చింది. అలాగే కారులోని స్మార్ట్‌ప్లే స్టూడియో అనే ఫీచర్ వాహన సమాచారం, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి సౌకర్యాలను కల్పిస్తోంది. వేగనార్‌లో డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్, ఏబీఎస్, ఈబీడీ, ఫ్రంట్ సీట్ బెల్ట్స్ రిమైండర్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, రియర్ పార్కింగ్ సెన్సర్స్, 5 స్పీడ్ ట్రాన్స్‌మిషన్, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ వంటి ప్రత్యేకతలున్నాయి. ఏఎంటీ ఆప్షన్ కూడా ఉంది.

హ్యుందాయ్ శాంట్రో, టాటా టియాగో కార్లకు కొత్త వేగనార్ గట్టి పోటీనివ్వొచ్చని మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. మరోవైపు వేగనార్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రూ.11,000లతో కారును బుక్ చేసుకోవచ్చు.

2,382 total views, 60 views today