టీజీ వెంకటేష్ నోరు అదుపులో పెట్టుకో.. పవన్ వార్నింగ్

టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్‌పై నిప్పులు చెరిగారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. టీజీ నోరు అదుపులో పెట్టుకోవాలంటూ స్ట్రాంగ్ వార్నిగ్ ఇచ్చారు. ఇష్టం వచ్చినట్లు పిచ్చిపిచ్చిగా మాట్లాడితే చూస్తూ ఊరుకోనంటూ మండిపడ్డారు. జనసేన వద్దనుకుంటే వచ్చిన రాజ్యసభ సీటుతో ఎంపీగా గెలిచి పనికిమాలిన మాటలు మాట్లాడొద్దన్నారు. బుధవారం విశాఖ జిల్లా పాడేరులో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన పవన్.. టీజీ వెంకటేష్, చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.

టీజీ వెంకటేష్‌కు పెద్దమనిషి అని గౌరవం ఇచ్చి ఇన్నాళ్లూ మాట్లాడానన్నారు పవన్. తాను నోరు విప్పితే మీరు ఏమవుతారో తెలియదంటూ ఫైరయ్యారు. పారిశ్రామికవేత్తగా నదులు, పర్యావరణాన్ని టీజీ వెంకటేష్ కలుషితం చేస్తున్నారని పవన్ ఆరోపించారు. టీడీపీ నేతలు ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దని హెచ్చరించారు. రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తారని ఏమీ ఆశించకుండా మద్దతిస్తే అధికారంలోకి వచ్చారని గుర్తు పెట్టుకోవాలన్నారు.

ఎన్ని ప్రభుత్వాలు మారినా మన్యంలో సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు జనసేనాని. ప్రజలకు న్యాయం చేస్తారని 2014లో టీడీపీకి మద్దతిస్తే.. ఈ నాలుగున్నరేళ్లు దోపిడీ జరిగిందన్నారు. బాక్సైట్ పేరుతో అక్రమంగా మైనింగ్ జరుపుతున్నారని.. బాక్సైట్ తవ్వకాలకు జనసేన వ్యతిరేకమన్నారు. ఈ నాలుగున్నరేళ్లలో ఏరోజైనా బాక్సైట్‌పై అసెంబ్లీలో మాట్లాడారా అంటూ వైసీపీ, టీడీపీలను ప్రశ్నించారు. ఇకపై గిరిజనులకు అండగా జనసేన ఉంటుందని భరోసా ఇచ్చారు.

దోపిడీ వ్యవస్థను చూసి విసిగిపోయానన్నారు పవన్. రక్షించాల్సిన ప్రజా ప్రతినిధులు దోచేస్తుంటే ఎవరికి ఫిర్యాదు చేయాలో ప్రజలకు అర్థం కావడం లేదన్నారు. గిరిజనుల సమస్యల్ని చాలా దగ్గరగా చూశానని.. ప్రజలకు 25 కేజీల బియ్యం, రూ.2వేల డబ్బు కాదు.. 25 ఏళ్ల భవిష్యత్‌ను ఇవ్వాలన్నారు. ఆ భవిష్యత్‌ను అందించే బాధ్యత జనసేన తీసుకుంటుందన్నారు. తనకు కొత్తగా పేరు, డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదన్నారు జనసేనాని. తన దగ్గర వేల కోట్లు లేవని.. ప్రజల కష్టాలు, బాధల్ని చూసిన వ్యక్తిగా వారికి సేవ చేయాలని ఆశ ఉందన్నారు

27 total views, 1 views today