హార్దిక్ పాండ్య, రాహుల్‌ వివాదంపై పెదవి విప్పిన కరణ్ జోహార్..!

భారత యువ క్రికెటర్లు హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్‌‌ కెరీర్‌లు సందిగ్ధంలో పడిపోవడానికి ప్రధాన కారణమైన బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఎట్టకేలకి పెదవి విప్పాడు. అతను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షోకి ఇటీవల హాజరైన హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్.. అక్కడ కరణ్ జోహార్ సరదాగా అడిగిన ప్రశ్నలకి కొంటెగా సమాధానం చెప్పి చిక్కుల్లో పడిన విషయం తెలిసిందే. తాను ఎంత మందితో శృంగారంలో పాల్గొన్నది, పార్టీల్లో అమ్మాయిల్ని చూసే విధానంపైనా హార్దిక్ పాండ్య అనుచిత వ్యాఖ్యలు చేయగా.. కేఎల్ రాహుల్.. తన జేబులో కండోమ్ ప్యాకెట్ ఉండటం, అది తన తండ్రి చూసి ఫర్వాలేదు రక్షణ కవచం వాడుతున్నావంటూ ప్రశంసించినట్లు చెప్పడంపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. యువతకి ఆదర్శంగా నిలవాల్సిన క్రికెటర్లు ఇలా అసభ్యకరంగా మాట్లాడటంతో వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపించాయి. దీంతో.. ఈ ఇద్దరి క్రికెటర్లనీ తాత్కాలికంగా సస్పెండ్ చేసిన బీసీసీఐ.. విచారణ చేపడుతోంది.

హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్‌ సస్పెన్షన్, వారి కెరీర్‌లు ప్రశ్నార్థకంలో పడిపోవడంపై తాజాగా కరణ్ జోహార్ స్పందించాడు. ‘నా షోకి వచ్చే సెలబ్రిటీలందరికీ సాధారణంగా అలాంటి ప్రశ్నలే వేస్తుంటాను. అందులో దీపికా పదుకొణె, అలియా భట్ తదితర హీరోయిన్లు కూడా ఉన్నారు. అయితే.. ఆ ప్రశ్నలకి వారు ఎలాంటి సమాధానాలు చెప్తారు అనేది మాత్రం నా పరిధిలో లేని అంశం. అలా అని నన్ను నేనేమీ సమర్థించుకోవడం లేదు. కానీ.. ఇది నా షో.. నేను ఆహ్వానిస్తేనే వారు అతిథులుగా వచ్చారు. వారు ఏం చెప్తే..? దాన్ని ప్రసారం చేయడం నా బాధ్యత. అయితే.. ఇప్పుడు ఈ హార్దిక్, రాహుల్ వివాదం నా పరిధిలో లేదు’ అని కరణ్ జోహార్ వెల్లడించాడు. వివాదం నేపథ్యంలో.. ఆ ఎపిసోడ్‌ని ఇంటర్నెట్‌ నుంచి తొలగించారు.

2,422 total views, 57 views today