వెలుతురు ఎక్కువైంది.. భారత్, కివీస్ మ్యాచ్ ఆగింది!

సూరీడి కారణంగా మ్యాచ్ ఆగిపోవడం ఎప్పుడైనా చూశారా? భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే ఈ కారణంగానే ఆగిపోయింది. ఎండ తీవ్రత కారణంగా బంతిని సరిగా గుర్తించడం బ్యాట్స్‌మెన్‌కు కష్టమైంది. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో తొలిసారిగా మ్యాచ్‌ను కాసేపు నిలిపేశారు. ఆటగాళ్ల భద్రత, వడదెబ్బ తగిలే ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని ఫీల్డ్ అంపైర్ షాన్ జార్జ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

భానుడు భగభగలాడుతూ.. సూర్య కిరణాలు ఆటగాళ్ల కళ్లలోకి పడుతుండటంతో ఆటగాళ్లు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయం గమనించిన అంపైర్లు కాసేపు మ్యాచ్ నిలిపేశారు. గతంలో దేశవాళీ క్రికెట్లో మాత్రమే ఎండ తీవ్రత కారణంగా మ్యాచ్‌లను నిలిపేసిన ఘటనలు ఉన్నాయి.

సూర్య కిరణాలు నేరుగా బ్యాట్స్‌మెన్ కళ్లలో పడకుండా ఉండటం కోసం పిచ్‌లను ఉత్తరం-దక్షిణ దిశల్లో రూపొందిస్తారు. కానీ తొలి వన్డే జరిగిన మెక్‌లీన్ పార్కులో పిచ్ తూర్పు-పడమర దిశల్లో ఉంది. దీంతో ఆటగాళ్లు ఇబ్బంది పడ్డారు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ 157 పరుగులకే కుప్పకూలింది. స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన భారత్‌ను శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ సాయంతో గెలిపించాడు.

2,413 total views, 57 views today