కొత్త ఏడాది కానుక.. ఒక్కో ఉద్యోగికి రూ.62 లక్షలు బోన‌స్‌

పైన ఉన్న ఫొటో చూశారా? కట్టల కొద్దీ డబ్బు. ఓ కొండలా పేర్చారు. ఈ సొమ్మంతా తమ సంస్థలోని ఉద్యోగులకు పంచడానికి. కొత్త ఏడాది కానుకగా సదరు సంస్థ యాజమాన్యం ఈ భారీ మొత్తాన్ని బోనస్ రూపంలో పంచింది. ఈ మొత్తం రూ.34 కోట్లు. కంపెనీలోని 5 వేల మందికి దీనిని బోనస్‌గా ఇచ్చారు. అంటే ఒక్కో ఉద్యోగికి రూ.62 లక్షలు. చైనా కొత్త ఏడాది త్వరలోనే రానున్న నేపథ్యంలో అక్కడి నాన్‌చాంగ్‌లో ఉన్న స్టీల్ కంపెనీ ఈ భారీ మొత్తాన్ని పంచి పెట్టింది. ప్రతి ఏడాది ముగింపు సందర్భంగా చైనాలోని ఇంధన కార్మికులు, సంస్థల ఉద్యోగులకు ఇలా భారీ మొత్తంలో బోనస్‌లు ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్నది. కొత్త ఏడాదిలో మళ్లీ కొత్త ఉత్సాహంతో ఉద్యోగులు పని చేయాలన్న ఉద్దేశంతో సంస్థలు ఇలా బోనస్‌లు ఇస్తాయి. అయితే ఈ బోనస్‌లు అందుకున్న ఉద్యోగాల్లో చాలా మంది మళ్లీ సదరు సంస్థలకు తిరిగి రాకపోవడం విశేషం. చైనాలోని కంపెనీల్లాగే ఇండియాలోనూ వజ్రాల వ్యాపారి సావ్‌జీ ఢోలాకియా తన సంస్థ హరే కృష్ణ ఎక్స్‌పోర్ట్స్‌లో పని చేసే ఉద్యోగులకు ప్రతి ఏటా దీపావళి సమయంలో ఖరీదైన బహుమతులు అందించే విషయం తెలిసిందే.

2,400 total views, 59 views today