అదరగొట్టిన కోహ్లి సేన.. తొలి వన్డేలో సునాయాస విజయం

నేపియర్: ఆస్ట్రేలియా టూర్ అద్భుతమైన ఫామ్‌ను న్యూజిలాండ్‌లోనూ కొనసాగిస్తున్నది టీమిండియా. బౌలర్లు మెరిసిన వేళ బుధవారం జరిగిన తొలి వన్డేలో 8 వికెట్ల తేడాతో సునాయాసంగా గెలిచింది. 156 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 34.5 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది కోహ్లి సేన. ఓపెనర్ శిఖర్ ధావన్ (75 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించాడు. కెప్టెన్ విరాట్ కోహ్లి 45 పరుగులు చేశాడు. కివీస్‌ను కేవలం 38 ఓవర్లలో 157 పరుగులకే కట్టడి చేయడంతో లంచ్ సమయానికి ముందే టీమిండియా చేజింగ్ మొదలుపెట్టింది. లంచ్ తర్వాత సూర్యుడి కారణంగా కొద్దిసేపు ఆట నిలిచిపోయింది. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం టార్గెట్‌ను 49 ఓవర్లలో 156 పరుగులకు కుదించారు. ఈ ఈజీ టార్గెట్‌ను టీమిండియా ఆడుతూ పాడుతూ చేజ్ చేసింది. ఈ విజ‌యంతో ఐదు వ‌న్డేల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యం సంపాదించింది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ 38 ఓవర్లలో 157 పరుగులకే ఆలౌటైంది. స్పిన్నర్లు కుల్‌దీప్ యాదవ్ (4), చాహల్ (2), పేస్‌బౌలర్ మహ్మద్ షమి (3) రాణించారు. ముఖ్యంగా షమి మొదట్లోనే కివీస్‌ను దారుణంగా దెబ్బ కొట్టాడు. ఓపెనర్లు గప్టిల్ (5), మన్రో (8)లను త్వరగా ఔట్ చేశాడు. ఆ తర్వాత కివీస్ కోలుకోలేదు. కెప్టెన్ విలియమ్సన్ (64) మాత్రమే హాఫ్ సెంచరీతో రాణించాడు.

2,430 total views, 57 views today