శబరిమల ఆలయంలోకి 51 మంది మహిళలు

కేరళ ప్రభుత్వం ఓ సంచలన విషయాన్ని సుప్రీంకోర్టుకు వెల్లడించింది. కోర్టు తీర్పు తర్వాత ఇప్పటివరకు పది నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు 51 మంది ఆలయంలోకి ప్రవేశించినట్లు చెప్పింది. అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలు ప్రవేశించవచ్చని గతేడాది సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఎంతో మంది గుడిలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే అయ్యప్ప భక్తులు వాళ్లను అడ్డుకోవడం, ఉద్రిక్త పరిస్థితులు, బంద్‌లు, హింసతో కేరళ అట్టుడికింది. ఆలయంలోకి వెళ్లి వచ్చిన ఇద్దరు మహిళలు తమకు ప్రాణభయం ఉన్నదని, రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు.జనవరి 2న తొలిసారి ఈ ఇద్దరు మహిళలు గుడిలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ మహిళలు దాఖలు చేసిన పిటషన్‌పైనే శుక్రవారం కోర్టు విచారణ జరిపి వాళ్లకు తగిన భద్రత కల్పించాలని ఆదేశించింది. ఈ సందర్భంగానే ఇప్పటివరకు ఆలయంలోకి వెళ్లిన మహిళల సంఖ్యను కేరళ ప్రభుత్వం కోర్టుకు వెల్లడించింది. ప్రభుత్వం తరఫున వాదిస్తున్న సీనియర్ అడ్వొకేట్ విజయ్ హన్సారియా ఆ 51 మంది జాబితాను కోర్టుకు అందజేశారు. ఈ ఇద్దరితోపాటు ఆలయంలోకి వెళ్లి వచ్చిన అందరికీ కేరళ ప్రభుత్వం ఇప్పటికే తగిన భద్రత కల్పిస్తున్నదని ఆయన కోర్టుకు తెలిపారు.

2,048 total views, 55 views today