కోడి పందేలకు రంగం సిద్ధం

సంక్రాంతి సందర్భంగా ‘పందెం కోడి’ విడుదలకు సిద్ధమైంది. మూడు రోజుల పాటు పెద్దఎత్తున నిర్వహించటానికి ప్రయత్నిస్తున్నారు. అధికారుల ఆదేశాలను పక్కనపెట్టి జిల్లా వ్యాప్తంగా బరులను సిద్ధం చేశారు. కోడిపందేలు, పేకాట, చిత్తులాట వంటి జూదాలు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే మామిడి తోటలను చదును చేసి చుట్టూ ఇనుప ఫెన్సింగ్‌, టెంట్లు వేసి బరులను సిద్ధం చేశారు. ఆదివారం నుంచే ప్రారంభించడానికి నిర్వాహకులు మంతనాలు చేస్తున్నారు.

ఈసారి ప్రేక్షకపాత్రేనా! : కోడిపందేలు నిర్వహించకుండా కట్టడి చేయడానికి గత ఏడాది జూదక్రీడలకు సంబంధం ఉన్న వ్యక్తులపై 501 కేసులు నమోదు చేశారు. 706 మందిపై బైండోవర్‌ నమోదు చేశారు. మామిడితోటల యజమానులకు నోటీసులు జారీ చేశారు. చివరికి పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. భారీస్థాయిలో కోడిపందేలు నిర్వహించగా, రూ.కోట్లు చేతులు మారాయి. సంక్రాంతి పర్వదినం సందర్భంగా సంస్కృతి, సంప్రదాయంగా వస్తున్న కోడిపందెం జూదక్రీడగా మారింది. మూడు రోజుల పాటు జరిగే పందేలు, కోసు (పేకాట) వంటి జూదాల్లో సామాన్యులు పెద్దమొత్తంలో డబ్బులు పోగొట్టుకొని అప్పులపాలవుతున్నారు. ఆస్తులను సైతం పోగొట్టుకున్న వారికి కొదవే లేదు. గతంలో పందెంరాయుళ్లుగా పేరుగాంచిన నిర్వాహకులే చాటుమాటుగా నిర్వహించగా, నాయకుల రంగప్రవేశంతో రాజకీయరంగు పులుముకుంది. విస్తృతంగా ప్రచారం చేస్తూ బాహాటంగానే నిర్వహిస్తున్నారు. సంక్రాంతికి ముందు హడావుడి చేసే పోలీసులు చివరకు చూసీచూడనట్లు వ్యవహరించాల్సి వస్తోంది. కోడిపందేలకు ఎలాంటి అనుమతులు లేవని, ఏవరైనా నిర్వహించినా, ప్రోత్సహించినా అరెస్టు చేయటమే కాకుండ రౌడీషీట్లు తెరుస్తామని చేస్తున్న హెచ్చరికలు ప్రకటనలకే పరిమితమవుతున్నారు.
* నిర్వాహకులు రెండు వర్గాలుగా విడిపోయి కోడిపందేలు నిర్వహిస్తారు. బరి స్థాయిని బట్టి రూ.లక్ష, రూ.50 వేలు, రూ.25 వేలు, రూ.10 వేలుగా నిర్ణయించి వేస్తారు. ఆసక్తి, ఆర్థికస్థోమతను పరిగణనలోకి తీసుకుంటూ పైపందేలు కాస్తుంటారు. ఇలా మూడు రోజుల పాటు పెద్దఎత్తున రూ.కోట్లు చేతులు మారుతున్నాయి. ఒకప్పుడు కొన్ని గ్రామాలకే పరిమితమైన పందేలు ఇప్పుడు పల్లెలతో పాటు పట్టణాలకు పాకాయి.

పందేల మాటున జూద శిబిరాలు : మూడు రోజుల పాటు జరిగే కోడిపందేల వల్ల పెద్దఎత్తున బరులు సిద్ధం చేసిన నిర్వాహకులకు పెద్దగా ప్రయోజనం లేదు. ఒక్కో పందేనికి ఒప్పందం చేసుకునే మొదలు బరిలోకి దింపి పూర్తి చేసే సరికి కనీసం గంట సమయం పడుతుంది. ముందుస్తుగా చేసుకున్న ఒప్పందాలు ఉంటే మాత్రం అర గంటకో పందెం వేస్తారు. ఖర్చుల రూపంలో వసూలు చేసే 10 శాతం మొత్తం బరులు సిద్ధం చేసినందుకు చేసిన ఖర్చులకు కూడా రాకపోవటం వల్ల గిట్టుబాటు కాదు. దీంఈతో ‘కోసు’గా పిలిచే ేపేకాట శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఇక్కడ క్షణాల్లో భవితవ్యం తేలిపోతుండగా, అదే సమయంలో అవగాహన లేకుండా ఆడితే మాత్రం జేబులు ఖాళీ చేసుకుని ఒట్టిచేతులతో ఇంటి ముఖం పట్టాల్సి ఉంటుంది. నిర్వాహకులు అనుభవజ్ఞులైన తమ అనుయాయులతో పేకాట శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒకవైపు కోడిపందేలతో పాటు పక్కనే పేకాట జరుగుతోంది. పలుకుబడి మరింత ఎక్కువగా ఉన్న చోట రాత్రి పూట ఫ్లడ్‌లైట్ల వెలుగులో తెల్లవార్లు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడ రూ.కోట్లలో పందేలు జరగటం వల్ల నిర్వాహకులకు లాభాలు మిగిలేందుకు అవకాశం ఉండటం, తమకు కూడా గిట్టుబాటు కావడంతో పేకాట శిబిరాలకు అనుమతులిస్తున్నారు.

జిల్లాలో కొన్ని బరులు: ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా సిద్ధం చేసిన బరులు వివరాలను పోలీసు యంత్రాంగం సేకరించింది. వాటిని చిత్రాల సహా తీసి ఉన్నతాధికారుల చరవాణుల వాట్సాప్‌కు పంపించారు. 2 తిరువూరు నియోజకవర్గం పరిధిలో కోకిలంపాడు వెళ్లే రహదారిలో మినీస్టేడియం వెనుక, కాకర్ల, ముష్టికుంట్ల, చీమలపాడు, రేపూడి, పోలిశెట్టిపాడు, విస్సన్నపేట, కొండపర్వ, కలగర, పుట్రేల, తెల్లదేవరపల్లి, గంపలగూడెం మండలం గొల్లపూడి, ఊటుకూరు, నెమలి, కనుమూరు.2 నూజివీడు నియోజకవర్గం పరిధిలో జనార్దనవరం, పోతనపల్లి, చీపురుగూడెం, చనుబండ, ముసునూరు, కొత్తూరు, సుంకొల్లు, గొడుగువారిగూడెం. 2 మైలవరం నియోజకవర్గం పరిధిలో నాగులూరు, హనుమాన్‌జంక్షన్‌ మండలం అంపాపురం, నందిగామ మండలం చందాపురం, కలిదిండి మండలం తాడినాడ తదితర చోట్ల ఇప్పటికే బరులు సిద్ధం చేశారు. 2 మచిలీపట్నం, కైకలూరు, పెడన, కోడూరు, మోపీదేవి, మొవ్వ, తోట్లవల్లూరు, గుడివాడ, పామర్రు, జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల పరిధిలోని మరికొన్ని గ్రామాల్లో శనివారం సాయంత్రానికి ఏర్పాట్లు పూర్తి చేశారు.

26 total views, 1 views today