సర్పంచ్‌ స్థానాల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలిపిన టీడీపీ

అసెంబ్లీ ఎన్నికలు జరిగి నెల రోజులు కూడా గడువక ముందే ప్రజాకూటమిలో కలహాలు చోటు చేసుకున్నాయి. కొత్తగూడెం ఎమ్మెల్యే స్థానానికి చిత్తశుద్ధితో పనిచేసి కాంగ్రెస్‌ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావును గెలిపించిన టీడీపీ నాయకులు తాజాగా జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో పలు స్థానాల్లో టీఆర్‌ఎస్‌ సర్పంచ్‌ అభ్యర్ధులకు తమ మద్దతు ప్రకటించారు. పొత్తు ధర్మానికి కాంగ్రెస్‌ వక్రభాష్యం చెప్పిందని, అందుకే టీఆర్‌ఎస్‌తో పొత్తుకు సిద్ధమయ్యామని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. పాల్వంచ మండలంలోని బసవతారక కాలనీ, బిక్కుతండ, తోగ్గూడెం, పాండురంగాపురంలో ఒక స్థానం, జగన్నాధపురం, రేగులగూడెం స్థానాల్లో టీడీపీకి టీఆర్‌ఎస్‌ మద్దతు తెలపగా మిగిలిన 30 పంచాయతీల్లో టీఆర్‌ఎస్‌కు టీడీపీ మద్దతు ఇచ్చేందుకు సిద్ధపడింది. అయితే టీడీపీ కోరిన స్థానాల్లో పోటీలో నిలపమని చెప్పిన కాంగ్రెస్‌ చివరకు కార్యకర్తలు తమ మాట వినటం లేదని పేర్కొంటూ అదే స్థానాల్లో పోటీకి నిలిపి పొత్తు ధర్మానికి తూట్లు పొడిచిందని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. తమ కార్యకర్తలకు కండువాలు కప్పి అంతా ప్రజాకూటమే అని మాయ చేస్తున్నారని, దీని వల్ల గ్రామాల్లో గందరగోళ పరిస్థితి నెలకొందని నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నట్టు తెలుస్తోంది.

సీపీఐ కూడా కాంగ్రెస్‌పై గుర్రుగా ఉందని, టీఆర్‌ఎస్‌తో అవగాహనకు వచ్చే అవకాశం ఉందని టీడీపీ నాయకులు చెపుతున్నారు. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఎల్‌ఎఫ్‌ తరుపున అభ్యర్ధిని బరిలో నిలిపిన సీపీఎం కూడా టీఆర్‌ఎ్‌సకు మద్దతు తెలిపే అవకాశం ఉన్నట్టు సమాచారం.

19 total views, 2 views today