‘F2’ మూవీ రివ్యూ

టైటిల్ : ఎఫ్‌ 2 (ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌)
జానర్ : కామెడీ ఎంటర్‌టైనర్‌
తారాగణం : వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌, తమన్నా, మెహరీన్‌, రాజేంద్ర ప్రసాద్‌, ప్రకాష్‌ రాజ్‌, ప్రగతి
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్‌
దర్శకత్వం : అనిల్‌ రావిపూడి
నిర్మాత : దిల్‌ రాజు

సంక్రాంతి బరిలో చివరి చిత్రం గా వచ్చిన ఎఫ్ 2 ఈరోజు గ్రాండ్ గా విడుదల అయ్యింది. వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టార్ మూవీగా పటాస్ ఫేమ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ గా తెరకెక్కిన ఈ మూవీ ని దిల్ రాజు నిర్మించారు.

సంక్రాంతి బరిలో ఎన్టీఆర్ కథానాయకుడు , చరణ్ వినయ విధేయ రామ చిత్రాలు ఉన్నప్పటికీ దిల్ రాజు మాత్రం ఫ్యామిలీ కథను నమ్ముకొని ఈరోజు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరి సంక్రాంతి అల్లుళ్లు గా వచ్చిన వెంకీ , వరుణ్ లు ఎలా సందడి చేసారు..? అసలు ఈ అల్లుళ్ల కష్టాలు ఏంటి..? వీరి ఫ్రస్ట్రేషన్‌ కు కారణం ఎవరు..? అనేది ఇప్పుడు చూద్దాం.

కథ‌ :
వెంకీ (వెంకటేష్‌) ఓ ఎమ్మెల్యే (రఘు బాబు) దగ్గర పీఏగా పనిచేస్తుంటాడు. వెంకీకి అమ్మా నాన్న లతో పాటు అక్కచెల్లెల్లు, అన్నదమ్ములు కూడా లేకపోవటంతో హారిక (తమన్నా) వెంకీని పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి తరువాత వెంకీ జీవితం పూర్తిగా మారిపోతుంది. అప్పటి వరకు తనకు నచ్చినట్టుగా గడిచిపోతున్న వెంకీ జీవితం.. భార్య, అత్తమామల రాకతో నరకంగా తయారవుతుంది. హారిక చెల్లెలు హని (మెహరీన్‌). కాలేజ్‌లో చదువుకుంటున్న హనీని వరుణ్‌ యాదవ్‌( వరుణ్‌ తేజ్‌) ఇష్టపడతాడు. వెంకీ వద్దని వారిస్తున్నా వినకుండా వరుణ్‌, హనీతో పెళ్లికి రెడీ అయిపోతాడు. వరుణ్ జీవితం పెళ్లి కాకుండానే హనీ చేతుల్లోకి వెళ్లిపోతుంది. దీంతో వెంకీ, వరుణ్‌లలో ఫ్రస్ట్రేషన్‌ పెరిగిపోతుంది. ఈ పరిస్థితుల్లో ఎదురింటి వ్యక్తి(రాజేంద్రప్రసాద్‌) చెప్పిన మాటలు విని వెంకీ తన భార్యను, వరుణ్‌ తనకు కాబోయే భార్యను వదిలేసి యూరప్‌ వెళ్లిపోతారు. తాము దూరమైతే భార్యలు కాళ్లభేరానికి వస్తారని అనుకుంటారు. కానీ హారిక, హనీలు యూరప్‌లోనే ఉండే దొరస్వామి నాయుడు కొడుకులను పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతారు. ఈ పరిస్థితుల్లో వెంకీ, వరుణ్‌లు ఏం చేశారు..? తిరిగి తమ భార్యలకు ఎలా దగ్గరయ్యారు..? అన్నదే మిగతా కథ.

విశ్లేష‌ణ‌ :

ఇద్ద‌రు భార్య బాధితుల జీవితాలు ఎలా ఉంటాయి? ఆ ఇంట్లో ఎలాంటి వినోదం పుడుతుంది? అన్న‌దాని నుంచే పుట్టింది ఈ సినిమా. ద‌ర్శ‌కుడు ముందు నుంచీ ఇది భార్య బాధితుల సినిమా అని చెబుతూనే ఉన్నాడు. వారు ప‌డే ఇబ్బందుల నుంచి ఫ‌న్ ఎలా పుట్టుకొచ్చింద‌నేది సినిమాలో చూపించాడు. ప్ర‌తి ఇంట్లోనూ జ‌రిగే విష‌యాలే స్క్రీన్‌పై క‌నిపిస్తాయి. ‘నువ్వు నాకు న‌చ్చావ్‌’, ‘మ‌ల్లీశ్వ‌రీ’లాంటి చిత్రాల్లో వెంక‌టేష్ చేసిన పాత్ర‌లు మ‌ళ్లీ ఈ మ‌ధ్య కాలంలో చేయ‌లేదు. చాలా రోజుల త‌ర్వాత ఆ స్థాయి పాత్ర‌లో వెంక‌టేష్‌ను చూస్తాం. తొలి స‌గం పూర్తిగా వినోద ప్రాధాన్యంగా దర్శకుడు నడిపించాడు. ప్ర‌తి సీన్‌ను న‌వ్వుల‌తో పండించాడు. ప్ర‌తి పాత్ర‌కు ఒక ప్ర‌త్యేక‌త ఉంటుంది. మెహ‌రీన్‌కు కూడా ఒక మేన‌రిజం ఇచ్చి, ఆ పాత్ర ప్ర‌త్యేకంగా క‌నిపించేలా చేశాడు. అత్తారింటిలో వెంక‌టేష్ చూపించే ఫ్ర‌స్ట్రేష‌న్ చూసి క‌చ్చితంగా న‌వ్వుకుంటారు. సందర్భోచిత కామెడీ రాసుకోవ‌డంలో ద‌ర్శ‌కుడు విజ‌యం సాధించాడు.
ద్వితీయార్ధం మొత్తం యూర‌ప్ చుట్టూ తిరుగుతుంది. అయితే, ప్ర‌థ‌మార్ధంలో ఉన్న బ‌లం ద్వితీయార్ధంలో క‌నిపించ‌దు. కానీ, ఈ రెండు జంట‌లు మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు మాత్రం కిక్ ఇస్తాయి. చివ‌రిలో నాజ‌ర్ పాత్ర ప్ర‌వేశించ‌డం కూడా క‌లిసి వ‌చ్చేదే. అక్క‌డ కూడా డైలాగ్‌లు చాలా బాగున్నాయి. మొత్తంగా ఇది ఒక ఫ‌న్ రైడ్ సినిమా. క‌థగా చెప్పాల్సి వ‌స్తే, ఇదేమీ గొప్ప క‌థ కాదు. గ‌తంలో ‘సంద‌డే సంద‌డి’, ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి!’ వంటి చిత్రాల ఛాయ‌ల్లోనే సాగుతుంది. సందేశాల జోలికి వెళ్ల‌కుండా, మరీ క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌వైపు ప‌రుగులు తీయ‌కుండా సున్నిత‌మైన వినోదాన్ని చ‌క్క‌గా ఆవిష్క‌రించాడు ద‌ర్శకుడు. అయితే, వినోదాన్ని పండించ‌డంలో కొన్ని చోట్ల శ్రుతి మించిన‌ట్లు అనిపిస్తుంది. పాత్ర‌లు కూడా కొన్నిసార్లు ఓవ‌ర్‌గా ప్ర‌వ‌ర్తిస్తున్నాయ‌నిపిస్తుంది. ఫ‌స్టాఫ్‌లో ఉన్న బిగి ద్వితీయార్ధంలో రాదు. అక్క‌డ‌క్క‌డా స‌న్నివేశాల‌ను పేర్చుకుంటూ వెళ్లిపోవ‌డంతో కాస్త సాగ‌దీత‌గా అనిపిస్తుంది.

ప్లస్‌ పాయింట్స్‌ :
లీడ్‌ యాక్టర్స్‌ నటన
సినిమాటోగ్రఫి
డైలాగ్స్‌

మైనస్‌ పాయింట్స్‌ :
ద్వితీయార్థంలో కొన్ని సీన్స్‌
పాటలు

రేటింగ్: 2.75 / 5

3,361 total views, 57 views today