Lakshmi’s NTR: లక్ష్మీ పార్వతి పాత్ర ఫస్ట్ లుక్ ఇదిగో..

నందమూరి తారక రామారావు జీవిత చరిత్రకు సంబంధించిన అసలు విషయాలను నేను చెప్తా అంటూ ప్రకటించిన సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరుతో సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి కోణంలో ఈ సినిమా ఉండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. సినిమాలో లక్ష్మీ పార్వతి పాత్ర ఎవరు పోషించనున్నారనే అంశం గురించి సినీప్రియులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తాజాగా రాంగోపాల్ వర్మ ఆ ఉత్కంఠకు తెరదించాడు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలో లక్ష్మీ పార్వతి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. దీంతో పాటు విడుదల చేసిన మరో పాత్రకు సంబంధించి ట్విటర్ వేదికగా ఆసక్తికర సవాల్ కూడా వేశారు.

కన్నడ నటి యజ్ఞ శెట్టి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలో ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతి పాత్రలో మెరవనున్నారు. శాండల్‌వుడ్‌లో గుర్తింపు ఉన్న నటి అయిన యజ్ఞ శెట్టి పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలోనూ ఇంతకుముందే నటించారు. వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కిల్లింగ్ వీరప్పన్’ సినిమాలో గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి పాత్రలో యజ్ఞ నటించి మెప్పించారు.

లక్ష్మీ పార్వతి పాత్రలో యజ్ఞ శెట్టి లుక్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విటర్ ద్వారా ఈ పాత్రకు సంబంధించిన పలు ఫొటోలను విడుదల చేశారు.

73 total views, 1 views today