కడప దర్గాను సందర్శించిన వైఎస్‌ జగన్‌

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కడప పెద్ద దర్గాను సందర్శించారు. శుక్రవారం సాయంత్రం అమీన్‌ పీర్ దర్గాకు వెళ్లిన జగన్‌‌కు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. అనంతరం దర్గాకు వెళ్లిన జగన్.. ప్రత్యేక ప్రార్థనలు చేసి దర్గా ఆచారం ప్రకారం చాదర్ సమర్పించారు. జగన్ వెంట కడప ఎమ్మెల్యే అంజాద్ బాషాతో పాటూ ముస్లిం నేతలు ఉన్నారు.

ప్రజా సంకల్పయాత్రను బుధవారం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగించిన జగన్ గురువారం తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకున్నారు. రాత్రికి కొండపైనే బసచేసి.. ఉదయం కడప జిల్లాకు వెళ్లారు. దారి మధ్యలో కార్యకర్తలు, స్థానికుల్ని పలకరిస్తూ కడపకు చేరుకొని దర్గాను సందర్శించారు. జగన్ ఇడుపులపాయలోని తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి సమాధి దగ్గర కూడా నివాళులు అర్పించనున్నారు.

పాదయాత్ర ప్రారంభానికి ముందు కూడా జగన్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.. అమీన్‌ పీర్‌ దర్గాను సందర్శించారు. ఇప్పుడు 14 నెలల పాటు సాగిన ప్రజా సంకల్పం విజయవంతంగా ముగియడంతో తన మొక్కులు చెల్లించుకుంటున్నారు.

36 total views, 1 views today