బంగారం జోరుకు కళ్లెం.. తగ్గిన ధర

గత నాలుగు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు శుక్రవారం తగ్గాయి. పది గ్రాముల బంగారం ధర రూ.40 తగ్గుదలతో రూ.33,030కు క్షీణించింది. దేశీ జువెలర్ల నుంచి డిమాండ్ నెమ్మదించడం ఇందుకు కారణం. వెండి ధరలు కూడా బంగారం బాటలోనే నడిచాయి. కేజీ వెండి ధర రూ.60 తగ్గుదలతో రూ.40,450కు పడిపోయింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ బలహీనంగా ఉండటం ఇందుకు కారణం.

దేశీ జువెలర్ల నుంచి డిమాండ్ నెమ్మదించడం, ప్రతికూల అంతర్జాతీయ సంకేతాలు బంగారంపై ప్రభావం చూపాయని ట్రేడర్లు పేర్కొన్నారు. అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్స్‌కు 0.38 శాతం పెరుగుదలతో 1,292.2 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.40 క్షీణతతో రూ.33,030కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.40 క్షీణతతో రూ.32,880కు తగ్గింది. కాగా బంగారం ధర గత నాలుగు రోజుల్లో రూ.570 పెరిగింది.

ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.25,300 వద్ద కొనసాగుతోంది. వెండి ధర రూ.40,450 కి తగ్గితే.. వారాంతపు ఆధారిత డెలివరీ ధర రూ.66 పెరుగుదలతో రూ.39,766కి పెరిగింది. ఇక 100 వెండి నాణేల కొనుగోలు, అమ్మకం విషయానికి వస్తే.. కొనుగోలు ధర రూ.77,000 ఉండగా.. అమ్మకం ధర రూ.78,000గా నమోదయ్యింది.

47 total views, 1 views today