ప్రపంచకప్‌ బెర్తులు ఫుల్‌

ఈ ఏడాది మే నెలాఖర్లో మొదలయ్యే ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌ కోసం భారత జట్టులో బెర్తులన్నీ దాదాపుగా భర్తీ అయిపోయాయని.. అలాగని జట్టులో ఎవరి స్థానానికీ గ్యారెంటీ లేదని, ఫామ్‌ కోల్పోతే ఎవరి మీదైనా వేటు పడొచ్చని టీమ్‌ఇండియా వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ చెప్పాడు. ‘‘ప్రపంచకప్‌ లోపు భారత్‌ ఆడాల్సిన వన్డేలు 13. ఈ మ్యాచ్‌ల్లో దాదాపుగా ఒకే జట్టు ఆడుతుంది. వచ్చే కొన్ని నెలల్లో ఆటగాళ్ల ఫామ్‌, గాయాలను బట్టి  ఒకట్రెండు మార్పులు జరిగితే జరగొచ్చేమో. మేం విరామం లేకుండా మ్యాచ్‌లు ఆడుతుండటం వల్ల గాయాలు కావడానికీ ఆస్కారముంది. జట్టులోని అన్ని బెర్తులకూ ఆటగాళ్లు భర్తీ అయిపోయారు. కానీ ఎవరి స్థానానికీ గ్యారెంటీ లేదు. టోర్నీకి ఎవరు వెళ్తారన్నది ఫామ్‌ను బట్టి ఆధారపడి ఉంటుంది. రాబోయే సిరీస్‌ల్లో అందరికీ అవకాశాలుంటాయి. ఎవరికి వాళ్లు సత్తా చాటాలి’’ అని అతనన్నాడు. జట్టు సమష్టిగా ప్రదర్శన చేయడం, ఆటగాళ్లు అవసరమైనపుడు బాధ్యత తీసుకుని ఆడటం ప్రపంచకప్‌ ముంగిట కీలకమైన విషయాలని రోహిత్‌ అభిప్రాయపడ్డాడు. ‘‘టాప్‌ ఆర్డర్‌ విఫలమైతే మిడిలార్డర్‌ బాధ్యత తీసుకుని ఆడాలి. స్వదేశంలో జరిగిన గత సిరీస్‌లో అంబటి రాయుడు సత్తా చాటాడు. కార్తీక్‌ కూడా రాణించాడు. ధోని ఎప్పుడూ కీలక ఆటగాడే. జాదవ్‌ బ్యాటుతో పాటు బంతితోనూ ఉపయోగపడే ఆటగాడు’’ అన్నాడు.

ధోని.. దారి చూపే దీపం: మహేంద్ర సింగ్‌ ధోని ఫామ్‌ గురించి ఎవరెన్ని సందేహాలు వ్యక్తం చేసినా.. భారత జట్టు మాత్రం అతడిపై పూర్తి నమ్మకంతో కనిపిస్తోంది. కెప్టెన్‌ కోహ్లి సహా అందరూ మహికి అండగా నిలుస్తున్నారు. తాజాగా ధోనికి మద్దతుగా వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ బ్యాటింగ్‌ చేశాడు. ‘‘డ్రెస్సింగ్‌ రూంలో, మైదానంలో ధోని ఉనికి ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఎన్నో ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం. అతనుంటే చుట్టూ ఒక ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. అది చాలా కీలకమైంది. అలాగే ధోని వికెట్ల వెనుక ఉంటే కెప్టెన్‌కూ ఎంతో సాయంగా ఉంటుంది. అలాంటి ఆటగాడు జట్టులో ఉంటే ఎప్పుడూ మంచిదే. అతను జట్టు సభ్యులకు దారి చూపే దీపం. గతంలో ధోని ఎన్నో మ్యాచ్‌ల్లో జట్టుకు మంచి ముగింపునిచ్చాడు. అతడి ప్రశాంతత, సలహాలు, ఆట విషయంలో అతడి ఆలోచనలు ప్రస్తుత తరుణంలో జట్టుకు చాలా అవసరం. కుల్‌దీప్‌, చాహల్‌ లాంటి స్పిన్నర్లు ధోని వికెట్‌ కీపర్‌గా ఉంటే అతడి సలహాలతో చాలా ప్రయోజనం పొందుతారు’’ అని రోహిత్‌  అన్నాడు.

28 total views, 1 views today