పేట సినిమా థియేటర్ వద్దే పెళ్లి.. అభిమానులే అతిథులు!

తమ అభిమాన నటుడి సినిమా విడుదల తేదీనే ఆ జంట తమ వివాహ ముహూర్తంగా నిర్ణయించుకుంది. సినిమా థియేటర్ ప్రాంగణంలోనే పెళ్లి వేడుకను ఏర్పాటు చేశారు. సినిమా చూడటానికి వచ్చిన అభిమానుల సాక్షిగా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఆ తర్వాత అతిథులందరికీ అక్కడే భోజనాలు ఏర్పాటు చేశారు. గురువారం (జనవరి 10) ‘పేట’ సినిమా విడుదల సందర్భంగా చెన్నై నగరంలో జరిగిన పెళ్లి ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌పై అభిమానం ఏ స్థాయిలో ఉంటుందో తెలియజెప్పే ఘటన ఇది. చెన్నైకి చెందిన అంబసు, కమాచి అనే యువతీ యువకులు.. తమ అభిమాన నటుడు రజినీ సినిమా పేట విడుదల ముహూర్తాన్నే శుభ ఘడియగా భావించారు. రజినీ వీరాభిమానులైన వారిద్దరూ ఇదే ముహూర్తానికి వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

వీరి పెళ్లి కోసం ‘పేట’ సినిమా ఆడుతున్న ఉడ్‌లాండ్స్‌ థియేటర్‌ ముందు వేదికను ఏర్పాటు చేశారు. అక్కడే హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. గతంలో రజినీ నటించిన సినిమాల పోస్టర్లను వేదిక వద్ద ఏర్పాటు చేశారు. ‘పేట’ సినిమా చూడడానికి వచ్చిన అభిమానులందరూ వీరి పెళ్లి చూసి హర్షం వ్యక్తం చేస్తూ అక్షింతలు వేశారు.

రజినీకాంత్ సినిమా విడుదలవుదంటే.. అభిమానుల హంగామా అంతా ఇంతా కాదు. కొంత మంది అభిమానులు తలైవా భారీ కటౌట్లకు పాలాభిషేకాలు చేస్తే.. మరి కొంత మంది సినిమా బాగా ఆడాలని కాంక్షిస్తూ.. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. శంకర్ దర్శకత్వంలో రజినీ హీరోగా ఇటీవలే విడుదలైన 2.0 సినిమా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అభిమానులకు సంక్రాంతి కానుకగా ‘పేట’ సినిమాతో రజినీ మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చాడు.

873 total views, 1 views today