‘యన్‌.టి.ఆర్‌ కథానాయకుడు‌’ మూవీ రివ్యూ

టైటిల్ : యన్‌.టి.ఆర్‌ కథానాయకుడు
జానర్ : బయోపిక్‌
నటీనటులు: బాలకృష్ణ, విద్యాబాలన్‌, రానా, సుమంత్‌, భరత్‌రెడ్డి, దగ్గుబాటి రాజా వెన్నెల కిషోర్‌, పూనమ్‌ బాజ్వా, మంజిమా మోహన్‌, నరేష్‌, మురళీశర్మ, క్రిష్‌, రవికిషన్‌, శుభలేఖ సుధాకర్‌, రవిప్రకాష్‌, చంద్ర సిద్ధార్థ, భానుచందర్‌, ప్రకాష్‌రాజ్‌, కె.ప్రకాష్‌, ఎన్‌.శంకర్‌, దేవి ప్రసాద్‌ తదితరులు
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్‌ వీఎస్‌
నిర్మాత: నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి
దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి

విశ్వవిఖ్యాత నట సార్యభౌముడు, ప్రజా నాయకుడు నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను తెరపై ఆవిష్కరిస్తున్నామని బాలకృష్ణ ప్రకటించగానే అందరి దృష్టి ఈ సినిమాపైనే పడింది. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన ఆ మహానుభావుడి కథను తెలుసుకోవాలని నేటి తరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసింది. ఆ నిలువెత్తు రూపాన్ని మరోసారి వెండితెరపై చూద్దామని నిన్నటి తరం ఆరాటపడింది. మొత్తానికి ఆ ఎదురుచూపులకు తెరదించుతూ ఎన్టీఆర్ సినీ చరిత్రను తెలియజెప్పే ‘కథానాయకుడు’ నేడు(జనవరి 9న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలకృష్ణ తన తండ్రి పాత్రను పోషించి తానే స్వయంగా నిర్మించిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ‌ :

ఎన్టీఆర్ సినీ జీవితం తెరచిన పుస్తకం అందుకే దర్శకుడు దశాబ్దాలుగా జనాలకు తెలిసిన విషయాలే సినిమాటిక్‌గా వెండితెర మీద చూపించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఎన్టీఆర్‌ కు ఆయన భార్యతో ఉన్న అనుబంధం ఆమె మాటకు ఎంత విలువ ఇస్తారన్న విషయాలను చూపించారు. ఎన్టీఆర్‌ బాల్యానికి సంబంధించిన అంశాల జోలికి పోకుండా డైరెక్ట్‌గా సినీ జీవితంతో కథను మొదలుపెట్టాడు. క్యాన్సర్‌తో బాధపడుతున్న బసవ రామ తారకం(విద్యాబాలన్‌) పరిచయంతో సినిమా ప్రారంభమవుతుంది. ఆమె ఎన్టీఆర్ ఆల్బమ్‌ను చూస్తుండగా అసలు కథ స్టార్ట్‌ అవుతుంది.

రామారావు (బాలకృష్ణ) రిజిస్టర్‌ ఆఫీస్‌లో మంచి ఉద్యోగం వచ్చినా అక్కడి పరిస్థితులు లంచాలకు అలవాటు పడిన అక్కడి ఉద్యోగుల పద్దతులు నచ్చక చేరిన మూడు వారాల్లోనే ఉద్యోగం వదిలేసి సినిమాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. గతంలో రామారావు వేసిన నాటకం చూసిన ఎల్వీ ప్రసాద్‌ (జిష్షు) సినిమా అవకాశం ఇస్తాననటంతో ఆయన్ను కలిసేందుకు మద్రాస్‌ బయల్దేరుతాడు. అలా మద్రాసు చేరిన రామారావు సినీ ప్రయాణం ఎలా మొదలైంది. మొదట్లో నటుడిగా ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులేంటి. అక్కినేని నాగేశ్వర్రావు (సుమంత్‌)తో ఆయన అనుబంధం. వెండితెర వేల్పుగా ఎన్టీఆర్‌ ఎదిగిన తీరు. ఆయన్ను రాజకీయాలవైపు నడిపించిన పరిస్థితులే సినిమా కథ. చివరగా ఎన్టీఆర్ రాజకీయ పార్టీని ప్రకటించటంతో తొలి భాగాన్ని ముగించారు.

విశ్లేష‌ణ‌ :

ఎన్టీఆర్ చ‌రిత్ర‌ను సినిమా తీయాల‌న్న‌ది ఒక గొప్ప ఆలోచ‌న‌. దానికి త‌గిన న‌టీన‌టులు సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు దొరికారు. ఎన్టీఆర్ జీవితంలో ఏం చూడాల‌నుకుంటున్నారో.. ఏం తెలుసుకోవాల‌నుకుంటారో.. అవ‌న్నీ తెర‌పై చూపించాడు ద‌ర్శ‌కుడు. ఎన్టీఆర్ సినిమా రంగ ప్ర‌వేశం చేసిన త‌ర్వాత ఆయ‌న పోషించిన పాత్ర‌ల‌న్నీ ప్ర‌తి ఐదు నిమిషాల‌కోసారి మ‌న‌కు ద‌ర్శ‌న‌మిస్తాయి. అదంతా పండ‌గ‌లా ఉంటుంది. ఆయా పాత్ర‌ల్లో బాల‌కృష్ణ అభిమానుల‌ను అల‌రిస్తారు. ద‌ర్శ‌కుడు ఈ సినిమాలో ఎమోష‌న‌ల్ స‌న్నివేశాల‌పై ఎక్కువ దృష్టిపెట్టాడు. ఎన్టీఆర్‌-బ‌స‌వ‌తారకం మ‌ధ్య ఉన్న అనుబంధం చూసి ఆశ్చ‌ర్య‌పోతారు. ఒక భ‌ర్త‌.. భార్యకు ఇంత‌లా ప్రాధాన్యం ఇస్తారా? అనిపిస్తుంది. ఎన్టీఆర్ జీవితంలో చోటు చేసుకున్న ప్ర‌తి మ‌లుపు క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించాడు ద‌ర్శ‌కుడు. మనదేశం, రైతుబిడ్డ చిత్రాల్లో ఎన్టీఆర్‌కు ఎలా అవకాశం వచ్చింది? తోటరాముడి పాత్ర ఎలా దక్కింది. కృష్ణుడిగా ఎన్టీఆర్‌ కనిపించినప్పుడు ఎదురైన సంఘటనలను దర్శకుడు చాలా చక్కగా చూపించాడు. కొన్ని స‌న్నివేశాలు రోమాలు నిక్క‌బొడిచేలా ఉంటాయి. కుటుంబమా? సినిమానా? ఏది ముఖ్యం అంటే ‘నాకు సినిమానే ముఖ్య‌మ‌’ని ప్రారంభ స‌న్నివేశాల్లో ఎందుకు ఎన్టీఆర్ చెప్పార‌నే దానికి స‌మాధానం విరామానికి ముందు తెలుస్తుంది. త‌న‌యుడు చావుబ‌తుకుల్లో ఉన్నా స‌రే నిర్మాత న‌ష్ట‌పోకూడ‌ద‌న్న ఉద్దేశంతో షూటింగ్‌కు వ‌చ్చిన ఒక మ‌హాన‌టుడిని తెర‌పై చూస్తాం. ఎన్టీఆర్ రాజ‌కీయాల్లో ఎందుకు రావాల‌ని అనుకుంటున్నాడు.. అందుకు ప్రేరేపించిన అంశాలు ఏంటి? క‌థానాయ‌కుడి జీవితం నుంచి రాజ‌కీయ నాయ‌కుడిగా ఎలా ఎద‌గాల‌నుకున్నాడ‌ది ప్రీక్లైమాక్స్‌లో క‌నిపిస్తుంది. దివిసీమ ఉప్పెన నేప‌థ్యాన్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు, గుండెల‌ను మెలి తిప్పేలా చూపించాడు ద‌ర్శ‌కుడు. అభిమానుల‌కు తెలిసిన విషయాలు, తెలియ‌ని విష‌యాలు అత్యంత నాట‌కీయంగా, స‌హ‌జంగా ద‌ర్శ‌కుడు తెర‌పైకి తీసుకొచ్చాడు.

ప్లస్‌ పాయింట్స్‌ :
+ ఎన్టీఆర్ ఎదిగిన తీరు, గెట‌ప్పులు
+ భావోద్వేగ స‌న్నివేశాలు
+ ఎన్టీఆర్‌-బ‌స‌వ‌తార‌కం సన్నివేశాలు
+ ఎన్టీఆర్‌-ఏయ‌న్నార్‌ల మైత్రి
+ సంభాష‌ణలు

మైనస్‌ పాయింట్స్‌ :
– నిడివి ఎక్కువ‌గా ఉండ‌టం

రేటింగ్: 3.5 / 5

 

7,268 total views, 54 views today