కేక్ కోసి షాకైన పెళ్లి కూతురు.. కటకటాల్లో వెడ్డింగ్ ప్లానర్!

పెళ్లి కోసం ఆమె ఎన్నో కలలుకంది. తన పెళ్లి జీవితాంతం గుర్తుండిపోయేలా వేడుకలా జరగాలనుకుంది. కానీ, వెడ్డింగ్ ప్లానర్ తప్పిదం వల్ల ఆమె ఆశలన్నీ అడియాశలయ్యాయి. బంధువులు, స్నేహితుల ముందు తీవ్ర అవమానానికి గురైంది. ఆనంద భాష్పాలతో చమ్మగిల్లాల్సిన ఆమె కళ్లు.. జరిగిన అవమానంతో కన్నీళ్లు పెట్టుకున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..

ఫిలిపిన్స్‌లోని పాసిగ్ నగరానికి చెందిన షిన్ టమాయో తన పెళ్లి బాధ్యతలను ఓ వెడ్డింగ్ ప్లానర్‌కు అప్పగించింది. ఇందుకు టమాయో, వరుడు జాన్ చెన్‌లు 140,000 పెసాస్ (భారత కరెన్సీ ప్రకారం రూ.1,87,268) చెల్లించారు. అన్ని ఏర్పాట్లు వెడ్డింగ్ ప్లానర్ చూసుకుంటారనే ధీమాతో టమాయో, జాన్ చెన్‌లు పెళ్లికి సిద్ధమయ్యారు.

వారు ఎంతగానో ఎదురుచూసిన పెళ్లి రోజు రానే వచ్చింది. పెళ్లి వేడుకను చూసేందుకు బంధుమిత్రులంతా హోటల్‌కు చేరుకున్నారు. పెళ్లి తర్వాత రిసెప్షన్‌లో విందుకు సిద్ధమవుతుండగా.. వెడ్డింగ్ ప్లానర్ చేతులెత్తేసింది. సమయానికి భోజనాలు సిద్ధం చేయకపోవడంతో టమాయో కుటుంబికులు దగ్గరలోని రెస్టారెంట్ నుంచి నూడుల్స్ ఆర్డర్ చేసి అతిథులకు అందించారు.

భోజనాల విషయంలో ఆవేదనకు గురైన టమాయోకు ఆమె కుటుంబికులు సర్దిచెప్పారు. వేదిక వద్ద ఏర్పాటుచేసిన వెడ్డింగ్ కేక్ కట్ చేయాలని కోరారు. దీంతో టమాయో కేక్ కట్ చేసేందుకు సిద్ధమైంది. కత్తితో కేక్ కట్ చేస్తూ మళ్లీ షాకైంది. కేకుకు బదులు థెర్మోకోల్ బయటపడటంతో టమాయోకు ఏం జరిగిందో అర్థం కాలేదు. కేకు మొత్తం థెర్మోకోల్‌తో తయారు చేసి, పైన క్రీమ్ రాసి డెకరేట్ చేశారని అర్థం చేసుకోడానికి ఆమెకు ఎంతో సమయం పట్టలేదు.

ఈసారి టమాయోకు కన్నీళ్లు ఆగలేదు. ఉబికి వస్తున్న దుఃఖాన్ని దిగమింగలేక అక్కడే గట్టిగా ఏడ్చేసింది. తన పెళ్లి రోజును చేదు జ్ఞాపకంగా మిగిల్చిన వెడ్డింగ్ ప్లానర్‌ క్రిస్సా కనానియాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేకును థెర్మోకోల్‌తో తయారు చేసి మోసానికి పాల్పడిన నేరంపై పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. మీరు కూడా పెళ్లి బాధ్యతలను వెడ్డింగ్ ప్లానర్‌కు అప్పగిస్తున్నట్లయితే.. తప్పకుండా ఆలోచించండి. లేకపోతే టమాయోకు ఎదురైన చేదు అనుభవమే మీకూ ఎదురు కావచ్చు.

853 total views, 1 views today