లగేజ్‌కు బదులు గిఫ్టుల‌ు… ప్రయాణికులకు బిగ్ సర్‌ప్రైజ్!

అప్పుడే విమానం దిగిన ప్రయాణికులు లగేజ్ కోసం కన్వేయర్ బెల్ట్ దగ్గర ఎదురు చూస్తున్నారు. అయితే, కన్వేయర్ బెల్ట్ మీద లగేజ్‌కు బదులు గిఫ్ట్‌లు రావడం చూసి అంతా ఆశ్చర్యపోయారు. అలా బెల్ట్ చుట్టూ గిఫ్టులే ఉండటంతో కాసేపు సందిగ్ధతకు గురయ్యారు. ఆ గిఫ్ట్‌లు మరెవ్వరికో కాదు.. వారికేనని తెలియగానే సంతోషంలో మునిగితేలారు.

పుణె విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఈ సర్‌ప్రైజ్ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. న్యూ ఇయర్ సందర్భంగా పుణెకు చెందిన ‘ఫీనిక్స్ మార్కెట్ సిటీ’ సంస్థ ఈ సర్‌ప్రైజ్‌కు ప్లాన్ చేసింది. #GoodLifeMoment‌లో భాగంగా సర్‌ప్రైజ్ గిఫ్టులు చూసి ప్రయాణికుల్లో కనిపించిన ఆనందాన్ని వీడియోలు, ఫొటోల్లో బందించేందుకు ఇలా ప్లాన్ చేసింది. ఈ సందర్భంగా ఆ కన్వేయర్ బెల్ట్ వద్ద ఉన్న పిల్లలు నుంచి పెద్దలు వరకు ప్రతి ఒక్కరికీ గిఫ్టులు లభించాయి. ఆ తర్వాత తమ లగేజ్‌ను తీసుకుని గిఫ్టులతో సెల్ఫీలు తీసుకుంటూ ఆ ఆనందాన్ని తమ ఆప్తులతో పంచుకున్నారు. మనసుకు హాయి గొలిపే ఇలాంటి సర్‌ప్రైజ్‌లు భలే సంతోషాన్ని ఇస్తాయి కదూ!!

752 total views, 1 views today