శబరిమల ఉద్రిక్తత… 3,178 మంది అరెస్టు

వరుసగా మూడో రోజూ కేరళ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. పటిష్ఠ పోలీసు బందోబస్తు నడుమ రెండు రోజుల క్రితం ఇద్దరు మహిళలు ఆలయంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. దీనికి నిరసనగా.. కేరళలో ప్రధాన హిందుత్వ సంస్థ అయిన శబరిమల కర్మ సమితి శుక్రవారం ఆందోళనకు పిలుపునిచ్చింది. దీనికి భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతిస్తుండగా.. ఆందోళనల్లో భాగంగా రాష్ట్రంలో కొన్ని చోట్ల హింసాత్మక వాతావరణం నెలకొంది. పోలీసులు, సీపీఐ(ఎం) కార్యకర్తలకు – భాజపా నాయకులకు మధ్య చాలా చోట్ల ఘర్షణ వాతావరణం చెలరేగింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకూ 3,178 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 37,979 మందిపై 1,286 కేసులు నమోదు చేశారు.

అయితే కేరళలో నెలకొన్న ఆందోళనకరమైన పరిస్థితిపై రాజకీయ పార్టీలన్నీ ఒకదానిపై మరొకటి దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఈ హింసాత్మక వాతావరణానికి భాజపా, అధికార సీపీఎంలే కారణమని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. ”భాజపా, సీపీఎంలే ఈ పరిస్థితులకు కారణం. హింసాత్మక ఘటనల వల్ల సామాన్యుడికి ప్రతికూల పరిస్థితులు కల్పించారు.” అని కేరళ కాంగ్రెస్‌ నాయకుడు రమేశ్‌ చెన్నితల విమర్శించారు. తక్షణం సీఎం స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చి, శాంతియుత వాతావరణం తీసుకురావాలని ఆయన కోరారు.

ప్రభుత్వ ప్రోత్సాహంతో హింస :భాజపా

మరోవైపు ప్రభుత్వం ఈ సమయంలో ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని భాజపా ఆరోపిస్తోంది. సున్నితమైన శబరిమల అంశాన్ని సీపీఎం రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూస్తోందని అన్నారు. ”ఆందోళనల విషయంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తన పార్టీ కార్యకర్తలందరికీ కావాల్సినంత స్వేచ్ఛనిచ్చారు. వీరికి మా పార్టీ కార్యకర్తలే లక్ష్యం. హిందూ మత విశ్వాసాలను, భాజపాను అణగదొక్కేందుకు సుప్రీంకోర్టు తీర్పును ముఖ్యమంత్రి పావుగా వాడుకుంటున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోన్న హింస” అని భాజపా అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు ఆరోపించారు.

ఈ నేపథ్యంలో జనవరి 15, 24 తేదీల్లో ప్రధాని మోదీ కేరళలోని కొల్లం, త్రిస్సూర్‌ ప్రాంతాల్లో ర్యాలీలో పాల్గొంటారని భాజపా వర్గాలు తెలిపాయి.

58 total views, 1 views today