శబరిమలలో మళ్లీ కలకలం…అయ్యప్పను దర్శించుకున్న శ్రీలంక మహిళ!

శబరిమల ఆలయంలోకి ఇద్దరు మహిళలు ప్రవేశించడంపై కేరళలో వెల్లువెత్తిన ఆందోళన చల్లారక ముందే తాజాగా మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. 46 ఏళ్ల మహిళ ఒకరు గురువారం రాత్రి స్వామి అయ్యప్పను దర్శించుకున్నారు. సదరు మహిళలను శ్రీలంకకు చెందిన శశికళగా గుర్తించారు. పాస్‌పోర్టులో పేర్కొన్న దాని ప్రకారం ఆమె పుట్టిన తేదీ 1972 డిసెంబర్ 3 గా ఉంది. ఆమె ఎలాంటి ఇబ్బందులు లేకుండా ”18 పడి మెట్లు” ఎక్కందనీ.. గర్భగుడిలో పూజలు చేసిందని పోలీసులు తెలిపారు. ”శశికళతో పాటు ఆమె బంధువులు కూడా వచ్చారు. సాయంత్రం 9.30కి దర్శనం పూర్తి చేసుకున్నారు. తిరిగి 11 గంటలకల్లా క్షేమంగా పంపకు చేరుకున్నారు…” అని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

పోలీసు పర్యవేక్షణలో కొనసాగే ఎలక్ట్రానిక్ క్యూ పద్ధతిలో ఆమె దర్శనం చేసుకున్నారనీ.. దర్శనం కోసం ఆమె ముందుగానే బుకింగ్ చేసుకున్నారనీ అధికారులు తెలిపారు. వయసుకు సంబంధించిన వివరాలు కూడా ముందే పంపారని పేర్కొన్నారు. తాను మెనోపాజ్‌కు చేరుకున్నానంటూ ఓ మెడికల్ సర్టిఫికెట్‌ను సైతం ఆమె పోలీసులకు సమర్పించినట్టు సమాచారం. కాగా శశికళ, ఆమె బంధువులు ఆలయానికి వస్తున్నట్టుగానీ, ఆమెకు భద్రత కల్పిస్తున్నట్టుగానీ ఎవరికీ తెలియకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. వారికి భద్రత కల్పించేందుకు పోలీసులు, మహిళా పోలీసులు మఫ్టీలో వెళ్లినట్టు ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.

51 total views, 1 views today