తిరుమలలో నూతన సంవత్సర వేడుకలు

నూతన సంవత్సర వేడుకలకు తిరుమల దివ్యక్షేత్రం ముస్తాబైంది. కొత్త ఏడాదిని స్వాగతిస్తూ శ్రీవారి ఆశీస్సులు అందుకోవడానికి భక్తకోటి ఎదురుచూస్తోంది. యాత్రికులకు మెరుగైన సేవలందించి.. స్వామివారి దర్శనం కనువిందుగా కల్పించడానికి తితిదే పలు చర్యలు చేపట్టింది. ఆలయ ప్రాకారం, గోపురాలు, ధ్వజస్తంభం, అంతరాలయాలను రంగురంగుల పూలు, విద్యుద్దీపాలతో అలంకరించింది. భక్తుల రద్దీ దృష్ట్యా.. శ్రీవారికి సోమ, మంగళవారాల్లో అన్ని ఆర్జిత సేవలను రద్దు చేసింది. సహస్రదీపాలంకరణ సేవను మాత్రం సర్కారు సేవగా నిర్వహించనుంది. సోమవారం అర్ధరాత్రి స్వామివారికి తిరుప్పావై పఠనం అనంతరం ఇతర కైంకర్యాలు పూర్తిచేసి.. మంగళవారం వేకువజామున 1.30 గంటల నుంచే వీఐపీ బ్రేక్‌ దర్శనాన్ని ప్రారంభించనుంది. వేకువజామున 4.30 గంటల నుంచి ధర్మదర్శనాన్ని మొదలుబెట్టి అర్ధరాత్రి వరకు సామాన్య భక్తులకు అవకాశం కల్పించనుంది. సోమవారం సాయంత్రానికి తిరుమలలో యాత్రికుల రద్దీ సాధారణంగా ఉంది. ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల ఇన్‌ఛార్జి జేఈవో పోలా భాస్కర్‌ క్యూలైన్లను పర్యవేక్షించారు.

47 total views, 1 views today