72 ఏండ్ల తర్వాత మొదటి భార్యను కలుసుకున్నాడు..

1946 నాటి ప్రేమ వారిది.. అదే ఏడాదిలో పెళ్లి చేసుకున్నారు. కానీ ఎనిమిది నెలలు మాత్రమే ఆ దంపతులు కలిసి ఉన్నారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ మళ్లీ వేర్వేరుగా పెళ్లిళ్లు చేసుకున్నారు. మళ్లీ 72 ఏండ్ల తర్వాత ఆ వృద్ధ దంపతులు తమ పిల్లల సహకారంతో కలుసుకున్నారు. వీరి కలయికకు ఒక పుస్తకం దారి చూపింది. అసలు ఆ పుస్తకం ఏమిటి? ఆ దంపతులు పళ్లైన ఏడాదికే ఎందుకు దూరం కావాల్సి వచ్చిందంటే ఒక్కసారి 1946 సంవత్సరంలోకి వెళ్లాల్సిందే. కేరళకు చెందిన ఈకే నారాయణ్(18), శారద(13)కు 1946, డిసెంబర్‌లో పెళ్లి అయింది. ఆ సమయంలోనే కేరళలో భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా పోరాటం జరుగుతోంది. ఈకే నారాయణ్, ఆయన తండ్రి తాళియన్ రామన్ ఇద్దరూ కలిసి భూస్వామ్యులకు వ్యతిరేకంగా రైతుల తరపున పోరాటం చేస్తున్నారు.డిసెంబర్ 30న రాత్రి నారాయణ్, రామన్‌తో పాటు మరో 500 మంది రైతులు కలిసి భూస్వామి అయిన కరకట్టిదామ్ నాయర్ ఇంటిని చుట్టుముట్టారు. ఆ రాత్రికి నాయర్‌ను చంపాలని రైతులందరూ నిర్ణయించుకున్నారు. ఇంతలోనే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. పోలీసులు రైతులను చుట్టుముట్టి కాల్పులు జరిపారు.

ఈ కాల్పుల్లో ఐదుగురు రైతులు ప్రాణాలు కోల్పోగా, నారాయణ్, ఆయన తండ్రి బుల్లెట్ గాయాలతో బయటపడ్డారు. మొత్తానికి పోలీసులు నారాయణ్‌తో పాటు ఆయన తండ్రిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. సీన్ కట్ చేస్తే.. నారాయణ్ తల్లి, ఆయన భర్త శారద ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు.

డిసెంబర్ 31న రాత్రి నారాయణ్ ఇంటిపై పోలీసులు దాడి చేసి ధ్వంసం చేశారు. పోలీసులు కాల్పులు జరుపుతుండగా తల్లి, కోడలు ఇద్దరు ప్రాణాలను కాపాడుకున్నారు. ఆ తర్వాత శారదకు ప్రాణహాని ఉందని గమనించిన నారాయణ్ తల్లి.. వారి సొంతింటికి పంపింది.

కొడుకు జైలు జీవితం, వస్తాడో రాడో అని భావించిన నారాయణ్ తల్లి.. కొన్నాళ్లకే శారదకు మరో పెళ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసింది. సీన్ కట్ చేస్తే.. ఎనిమిదేళ్లు జైలు జీవితం అనుభవించిన నారాయణ్ 1954లో విడుదల అయ్యాడు.

అప్పుడు శారదకు మరో వివాహం అయిందని తెలుసుకున్నాడు. ఇక నారాయణ్ కూడా పెళ్లి చేసుకున్నాడు. ఆయనకు ఎనిమిది మంది పిల్లలు. 1946లో దూరమైన ఆ దంపతులు 72 ఏండ్ల తర్వాత ఎలా కలుసుకున్నారంటే..

ఒక పుస్తకం ద్వారా. నారాయణ్ మేనకోడలు, రచయిత శాంత.. 30 డిసెంబర్ అని ఒక పుస్తకం రాసింది. 1946, డిసెంబర్ 30న జరిగిన సంఘటనలను అన్నింటినీ జోడించి పుస్తక రూపంలో తీసుకువచ్చారు శాంత.

ఈ పుస్తకం మొత్తానికి శారద కుమారుడు భార్గవన్స్ చదివాడు. దీంతో తన అమ్మ మొదటి భర్త గురించి తెలుసుకున్నాడు. ఇంకా నారాయణ్ బతికే ఉన్నాడని తెలుసుకున్న భార్గవన్స్.. శారద, నారాయణ్‌ను కలిపేందుకు చొరవ తీసుకున్నాడు.

మొత్తానికి ఇటీవలే నారాయణ్‌ను శారద ఇంటికి ఆహ్వానించి 1946 సంఘటనలను గుర్తు చేసుకున్నారు. తన మొదటి భర్త శారద తలపై చేయి పెట్టి ఆనంద పడ్డాడు నారాయణ్. మంచి భోజనంతో నారాయణ్‌కు భార్గవన్స్ విందు ఏర్పాటు చేశాడు.

6,927 total views, 56 views today