ఔషధమొక్కల సాగుకు ప్రోత్సాహం

బైబ్యాక్ ఒప్పందంతో రైతులు ఔషధమొక్కలు సాగుచేసి లాభాలు పొందవచ్చని రాష్ట్ర వ్యవసాయ, సహకారశాఖ ముఖ్య కార్యదర్శి సీ పార్థసారథి పేర్కొన్నారు. రాజేంద్రనగర్‌లోని ఔషధ, సుగంధద్రవ్య మొక్కల పరిశోధన స్థానంలో అలొవెర ప్రాసెసింగ్‌ప్లాంటును ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ.. ఔషధ, సుగంధద్రవ్యాల మొక్కల వాణిజ్యసాగుకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నదన్నారు. ఈ ప్రాసెసింగ్‌ప్లాంటు ఏర్పాటుతో రాష్ట్రంలోని రైతులు తాము పండించిన అలొవెర పంటను ఇక్కడ ప్రాసెసింగ్ చేసుకునే అవకాశం ఉన్నదని వివరించారు. ఔషధమొక్కల పెంపకంలో మెళకువలను ఇక్కడి నిపుణులు అందిస్తారని.. యువ రైతులకు రెండు నుంచి ఎనిమిదిరోజులపాటు శిక్షణ కూడా ఇస్తారని తెలిపారు. శిక్షణ పొంది.. సొంతంగా ప్రాసెసింగ్ ప్లాంట్లు పెట్టుకొనేందుకు ప్రభుత్వసంస్థలు ఆర్థిక సాయంచేస్తాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పరిశోధన సంచాలకులు డాక్టర్ భగవాన్, డీన్ డాక్టర్ ఎం విజయ, రిజిస్ట్రార్ డాక్టర్ రవీందర్‌రెడ్డి, కంప్ట్రోలర్ డాక్టర్ కిరణ్, డాక్టర్ ఎం పద్మ తదితరులు పాల్గొన్నారు.

6,916 total views, 56 views today