‘అంతరిక్షం’ మూవీ రివ్యూ

టైటిల్ : అంతరిక్షం
జానర్ : సైన్స్‌ఫిక్షన్‌ స్పేస్‌ థ్రిల్లర్‌
తారాగణం : వరుణ్‌ తేజ్‌, అదితిరావ్‌ హైదరి, లావణ్య త్రిపాఠి, సత్యదేవ్‌, రాజా, రెహమాన్‌, శ్రీనివాస్‌ అవసరాల
సంగీతం : ప్రశాంత్ విహారి
దర్శకత్వం : సంకల్ప్‌ రెడ్డి
నిర్మాత : క్రిష్‌, రాజీవ్‌ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి, మురళి

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మొదటి నుంచి భిన్నమైన సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. సినిమా సినిమాకి తేడా చూపిస్తున్నారు. ఆయన ఎంచుకునే ప్రతి కథలోనూ ఏదో కొత్తదనం ఉంటుంది. అందుకే ‘ఘాజీ’ లాంటి వైవిధ్యమైన చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సంకల్ప్ రెడ్డితో వరుణ్ జతకట్టారు. తెలుగు సినీ చరిత్రలోనే తొలిసారి ఓ స్పేస్ మూవీ రావడానికి కారణమయ్యారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, అదితిరావు హైదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ ‘అంతరిక్షం 9000 కేఎంపీహెచ్’. సంకల్ప్ రెడ్డి దర్శకుడు. క్రిష్ జాగర్లమూడి సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. క్రిస్మస్ వీక్‌ను క్యాష్ చేసుకోవడానికి శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కథ‌ :
దేవ్‌ (వరుణ్ తేజ్‌) ఓ స్పేస్‌ సైంటిస్ట్‌. రష్యాలో ట్రైన్‌ అయిన వ్యోమగామి. ఎన్నో ఆశలతో చంద్రుడి మీద నీటి జాడలు తెలుసుకునేందుకు విప్రయాన్‌ అనే శాటిలైట్‌ను ప్రయోగిస్తాడు. కానీ ఆ మిషన్‌ ఫెయిల్ అవుతుంది. అదే సమయంలో తను ప్రేమించిన పారు (లావణ్య త్రిపాఠి) కూడా ప్రమాదంలో చనిపోతుంది. దీంతో దేవ్‌ స్పేస్‌ రిసెర్చ్‌కు దూరమవుతాడు. కానీ ఐదేళ్ల తరువాత రిసెర్చ్‌ సెంటర్‌కు దేవ్‌ అవసరం పడుతుంది. మిహిరా శాటిలైట్‌ కక్షనుంచి పక్కకు తప్పుకొని మరో శాటిలైట్‌ను డికొట్టబోతుందని తెలుస్తోంది. మిహిరాను దేవ్‌ మాత్రమే కరెక్ట్ చేయగలడని అతన్ని పిలిపిస్తారు. రియా(అదితిరావ్‌ హైదరి), కరణ్‌ (సత్యదేవ్‌), సంజయ్‌ (రాజా)లతో కలిసి స్పేస్‌లోకి వెళ్లిన దేవ్‌. మిహిరాను ఎలా సరిచేశాడు.? స్పేస్‌లో దేవ్‌ తీసుకున్న సాహసోపేత నిర్ణయమేంటి..? అన్నదే మిగతా కథ.

ఎలా ఉందంటే:
అంతరిక్షానికి సంబంధించిన కథ అనగానే మనకు హాలీవుడ్‌ చిత్రాలు గుర్తుకువస్తాయి. తెలుగులో ఇలాంటి ప్రయత్నం ఎవ్వరూ చేయలేదు. భారతదేశంలో ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వచ్చాయి. ఇలాంటి కథాంశాన్ని ఎంచుకోవడం ఓ రకంగా సాహసమనే అనుకోవాలి. మరీ సైంటిఫిక్‌గా చెబితే తెలుగు ప్రేక్షకుల అభిరుచికి దూరంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మన ప్రేక్షకులకు పరిచయమైన ప్రేమ, సెంటిమెంట్‌, సున్నితమైన దేశభక్తి…ఇలాంటివన్నీ మేళవించి సంకల్ప్‌ రెడ్డి ఓ కథగా రాసుకున్నారు. తొలి సగమంతా దేవ్‌ ఆశయాలు, తన ప్రేమకథ, ఈ దేశానికొచ్చిన సమస్య.. వీటితోనే సాగిపోయింది.

ద్వితీయార్ధంలో కథ అంతరిక్షంలోకి ప్రవేశిస్తుంది. అంతరిక్షంలో దేవ్‌ చేసే సాహసాలే ఈ కథకు మూలం. ద్వితీయార్ధం మొత్తం అంతరిక్షంలో సాగుతుంది కాబట్టి కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తాయి. వాటిని దర్శకుడు నడిపించిన విధానం కూడా ఆకట్టుకుంటుంది. తర్వాత ఏం జరుగుతుందా? అనే ఉత్కంఠతను రేకెత్తించగలిగాడు. కాకపోతే ఇక్కడ ఒక ఇబ్బంది ఉంది. సైంటిఫిక్‌ పదజాలం, శాటిలైట్‌కు సంబంధించిన పద ప్రయోగాలు ఇవన్నీ తెలుగు ప్రేక్షకులకు అంతగా అర్థంకాకపోవచ్చు. అంతరిక్షంలో ఏం జరుగుతుందా? అన్న గందరగోళం నెలకొంటుంది. నిజానికి భారతదేశానికి వచ్చిన సమస్య ఏంటో కూడా ప్రేక్షకుడికి ఓ పట్టాన అర్థంకాదనే చెప్పాలి. సైన్స్‌ పరిజ్ఞానం ఉన్నవారికి, శాటిలైట్‌, రాకెట్‌ సైన్స్‌ గురించి తెలిసినవారికి సులభంగానే కథాగమనం అర్థం అవుతుంది. జీరో గ్రావిటీకి సంబంధించిన సన్నివేశాలు అంత ప్రభావవంతంగా రాలేదేమో అనిపిస్తుంది. ‘ఇంటర్‌స్టెల్లార్’‌ ‘గ్రావిటీ’ సినిమాలు చూసినవారికి ఈ కథ కొత్తగా అనిపించకపోవచ్చు. తెలుగు ప్రేక్షకులకు ఆ సినిమాలు కొత్త కాబట్టి ఓ రకంగా ‘అంతరిక్షం’ సరికొత్త అనుభూతినిస్తుంది.

ప్లస్‌ పాయింట్స్‌ :
సరికొత్త నేపథ్యం
దర్శకుడి ఆలోచన
సాంకేతిక నిపుణుల పనితనం

మైనస్‌ పాయింట్స్‌ :
సైన్స్‌ పదజాలం ఎక్కువగా ఉండటం
స్లో నరేషన్‌

రివ్యూ : 2 / 5

7,032 total views, 50 views today