రౌడీలు రాజ్యమేలుతున్నారు.. అందుకే నేను దిగా: పవన్ కళ్యాణ్

కుల్లిపోతోన్న సమాజాన్ని చూసి చిన్నప్పటి నుంచి తాను ఎంతో విసుగుపోయానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాజకీయ నాయకులు విలువలు చెప్పేవాళ్లు తప్ప ఆ విలువలను పాటించేవారు కాదని, అది చూసి తనకు ఎంతో విసుగు ఉండేదని చెప్పారు. పోనీ, పెరిగి పెద్దయిన తరవాత ఏమైనా బాగుంటుంది అనుకుంటే అది కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో రాను రాను పట్టణీకరణ, అవినీతి పెరిగిపోయి రౌడీలు రాజ్యమేలే స్థాయికొచ్చామని అన్నారు. అవినీతికి మారుపేరైన రౌడీలు పాలకులుగా మారితే.. అంబేద్కర్, గాంధీజి వంటి ఫౌండింగ్ ఫాదర్స్ చేసిన త్యాగాలకు విలువేముందని ఆవేదన వ్యక్తం చేశారు.

‘రౌడీలా మన జీవితాలను నిర్ణయించేది. చాలా చిన్నప్పుడు నుంచి నాకున్న కోపం ఇది. మన ఆడపడుచులను బయటికి పంపిస్తే క్షేమంలేని సమాజాన్ని చూసి విసుగుండేది. సినిమాలు చేస్తే సరిపోతుందిలే అనుకునేవాడిని. సినిమాలు చేస్తే తృప్తి ఉంటుందేమో అనుకునేవాడిని. కానీ నిజానికి ఇవి నాకు సంతృప్తినివ్వలేదు’ అని పవన్ అన్నారు. 2014లో ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా తాను తొలిసారి పార్లమెంట్‌లో అడుగుపెట్టానని పవన్ గుర్తుచేశారు. అప్పుడు సెంట్రల్ హాల్‌‌ను చూసినప్పుడు ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’ అనే నెహ్రూ గారి స్పీచ్ గుర్తుకొచ్చిందని చెప్పారు.

‘నెహ్రూ లాంటి గొప్ప వ్యక్తులు అడుగుపెట్టిన పార్లమెంటులో ఇప్పుడు డబ్బులతో ఓట్లు కొనేసి వెళ్లినవాళ్లు, దౌర్జన్యంతో వెళ్లినవాళ్లు ఉన్నారు. కొంత మంది కష్టపడి వెళ్లినవారు ఉన్నారు. మొత్తం మీద అంతా కలగలిపి ఉన్నారు. ఎంతో మంది గొప్పవాళ్లు త్యాగాలు చేసి మనకు ఈ స్థానాన్ని ఇస్తే అక్కడ కూర్చున్న వాళ్లందరినీ చూసి నాకు ఇబ్బంది అనిపించింది. ప్రస్తుతం మన రాజకీయ వ్యవస్థ పరిస్థితి ఇది’ అని పవన్ మండిపడ్డారు.

సమాజంలో గొప్ప మార్పులు తీసుకురావడానికి తాను రాజకీయాల్లోకి రాలేదని, సమాజం కోసం పోరాటం చేయడానికి వచ్చానని పవన్ కళ్యాణ్ చెప్పారు. ‘అందరిలా నేనూ చేతులు కట్టుకుని కూర్చోవాలా? సినిమాలు చేసుకుంటూ, ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ వృద్ధాప్యంలో చచ్చిపోవాలా? ఇవన్నీ కాకుండా నాదైన పోరాటం చేయాలని చాలా బలంగా నిర్ణయించుకున్నాను. ఆ నిర్ణయమే నాతో జనసేన పార్టీని స్థాపించేలా చేసింది’ అని పవన్ కళ్యాణ్ వివరించారు.

215 total views, 2 views today