భాజపాకు ఎంపీ సావిత్రిబాయి ఫూలే రాజీనామా

లక్నో : ఉత్తరప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీకి భారీ షాక్ తగిలింది. బరేక్(ఉత్తరప్రదేశ్) ఎంపీ సావిత్రిభాయి ఫూలే బీజేపీకి రాజీనామా చేశారు. భారతీయ జనతా పార్టీ సమాజంలో అంతరాలు పెంచుతుందని, అసమానతలు సృష్టిస్తోందని సావిత్రిభాయి ఫూలే తెలిపారు. దళితులపై బీజేపీ కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని ఆమె గతంలో బహిరంగంగా విమర్శించిన విషయం తెలిసిందే. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు దళితులపై ప్రేమ ఉంటే హనుమంతుడిని అభిమానించే దాని కంటే రెట్టింపు.. దళితులని ప్రేమించాలన్నారు సావిత్రిభాయి ఫూలే. ఊరికే హనుమంతుడు దళితుడని చెప్పడం కాదన్నారు. దళితులను ఎప్పుడైనా యోగి కౌగిలించుకున్నారా? అని ప్రశ్నించారు. ఎన్నికల కోసం యోగి డ్రామాలడుతున్నారని.. ఈ విషయాన్ని దేశంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీలు గమనించాలని ఫూలే సూచించారు.

హనుమంతుడు దళితుడేనని బీజేపీ ఎంపీ సావిత్రీ బాయిఫూలే నొక్కి చెప్పారు. మంగళవారం ఆమె పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ హనుమంతుడు దళితుడే. ఆయనను మనువాదులకు బానిసగా మార్చారు. రాముడి కోసం ఆయన ఎంతో చేశారు. కానీ, చివరికి హనుమంతుడికి ఓ తోకను తగిలించి, ఆయన ముఖానికి మసిపూసి కోతిగా ఎందుకు చిత్రీకరించారు అని ప్రశ్నించారు. హనుమంతుడు కూడా మనిషి అని, ఆయన కోతి కాదని తెలిపారు. దళితుడైనందుకు హనుమంతుడు కూడా అవమానాన్ని ఎదుర్కొన్నారని చెప్పారు. అసలు దళితులను ఎందుకు మనుషులుగా గుర్తించరని ప్రశ్నించారు.

35 total views, 1 views today