4 రోజులు శ్రీవారి ప్రత్యేక దర్శనాలు రద్దు…సిఫార్సు లేఖలు స్వీకరించం

వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని డిసెంబరు 17 నుంచి 20 వరకు ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తిరుమల జేఈవో శ్రీనివాసరాజు వెల్ల్లడించారు. డిసెంబరు 18న వైకుంఠ ఏకాదశి, 19న వైకుంఠ ద్వాదశి ఏర్పాట్లపై అధికారులతో కలిసి ప్రణాళికను గురువారం రూపొందించారు. ఈ సందర్భంగా జేఈవో విలేకరులతో మాట్లాడుతూ ‘‘డిసెంబరు 18, 19న శ్రీవారి ఆర్జితసేవలన్నింటినీ రద్దు చేస్తున్నాం. ప్రత్యేక దర్శనాలన్నీ 4 రోజుల పాటు రద్దు చేయనున్నాం. రెండు కనుమ రహదారులను 24 గంటల పాటు తెరచి ఉంచుతాం. తిరుమలలో వసతికి తీవ్ర కొరత దృష్ట్యా తిరుపతిలో బస చేసి రావడానికి సౌకర్యంగా చర్యలు తీసుకున్నాం. డిసెంబరు 18న వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం 17న ఉదయం 10 గంటల నుంచి భక్తులను కంపార్ట్‌మెంట్లలోకి అనుమతిస్తాం. తిరువీధుల్లో భారీగా ఇనుప పందిళ్లు వేసి యాత్రికులకు చలిగాలుల నుంచి రక్షణ కల్పిస్తాం. వైకుంఠ ఏకాదశి పర్వదినాన వేకువజామున 1.30 గంటలకు వీఐపీ బ్రేక్‌ దర్శనం, ఉదయం 5.30 గంటలకు సర్వదర్శనం ప్రారంభిస్తాం. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో రెండు రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరచి ఉంటాయి. ఈ రోజుల్లో 1.70 లక్షల మందికి శ్రీవారి దర్శనం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. స్వయంగా వచ్చిన ప్రముఖులను గుర్తించి వసతి, టిక్కెట్ల కల్పనకు చర్యలు తీసుకుంటాం. ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించబోం. వైకుంఠ ద్వాదశి రోజున ఉదయం బ్రేక్‌ దర్శనాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నాం. రెండు రోజులకు కలిపి 43 నుంచి 44 గంటల పాటు సామాన్య భక్తులకే ప్రాధాన్యత ఇస్తున్నాం’’ అని జేఈవో తెలిపారు.

66 total views, 1 views today