నటీనటులు: రజనీకాంత్, అక్షయ్‌కుమార్, అమీ జాక్సన్, సుదాంశు పాండే, అదిల్ హుస్సేన్, కళాభవన్ షాంజాన్, రియాజ్‌ఖాన్ తదితరులు
సంగీతం: ఏఆర్ రెహమాన్
సినిమాటోగ్రఫీ: నీరవ్ షా
ఎడిటింగ్: ఆంథోని
ఆర్ట్: టి.ముత్తురాజు
వీఎఫ్ఎక్స్ అడ్వైజర్: శ్రీనివాసమోహన్
ఫైట్స్: సెల్వ
నిర్మాత: ఎ.సుభాష్‌కరణ్, రాజు మహాలింగం
రచన, దర్శకత్వం: శంకర్
సంస్థ: లైకా ప్రొడక్షన్స్
సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం చిట్టి అనే ‘రోబో’ను దర్శకుడు శంకర్ మనకు పరిచయం చేశారు. మనిషిలా ఉండే ఈ రోబోతో కామెడీ చేయించారు. ఆ రోబోలో ప్రేమ పుట్టేలా చేశారు. స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్‌లా ఫీట్లు, ఫైట్లు చేయించారు. మొత్తం మీద ఓ రోబోతో అన్నీ చేయించి భారత సినీ చరిత్రలో ఓ కొత్త వరవడికి నాంది పలికారు. అద్భుతమైన విజువల్స్, కళ్లు చెదరగొట్టే విఎఫ్ఎక్స్, రెహమాన్ సంగీతం, రజినీకాంత్ నటన, ఐశ్యర్యరాయ్ అందం.. ఇలా ‘రోబో’లో ప్రతి అంశం ప్రేక్షకుడిని కట్టిపడేసింది.
అయితే, చిట్టి వల్ల సమాజానికి మంచి కన్నా చెడు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని ఆ రోబోను శంకర్ డిస్మాంటిల్ చేశారు. మళ్లీ ఎనిమిదేళ్ల తరవాత ఆ చిట్టిని రీలోడ్ చేసి మంచికి వాడే ప్రయత్నం చేశారు. వర్షన్ ‘2.0’ను రూపొందించి మరోసారి మాయచేయడానికి సిద్ధమయ్యారు. ‘రోబో’లో తన స్వార్థం కోసం క్రూరంగా మారిపోయిన చిట్టిని మార్చి.. ‘2.0’లో ప్రజల కోసం పోరాడేలా తీర్చిదిద్దారు. ‘రోబో’ను మించి ఈ రెండో వర్షన్లో విజువల్ ఎఫెక్ట్స్, 3డి విజువల్స్, 4డి మ్యూజిక్‌ను జోడించి ప్రేక్షకులు థియేటర్లో మైమరిచిపోయేలా చేయడానికి వచ్చేశారు.
కథ:
హఠాత్తుగా నగరంలోని సెల్ఫోన్లు మాయమవుతుంటాయి. మనుషులు మాట్లాడుతుంటే వారి చేతుల్లోంచి కూడా ఫోన్లు ఎగిరిపోతుంటాయి. అయితే ఈ సమస్య ఎందుకు ఎదురైంది? ఎలా పరిష్కరించాలో ఎవరికీ అంతుపట్టదు. ఈ పరిణామాలకు కారణాలేంటో శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోతారు. డా.వసీకరణ్ (రజనీకాంత్) రంగంలోకి దిగి దీన్ని చిట్టి మాత్రమే పరిష్కరించగలడని భావించి.. మళ్లీ దానికి ప్రాణం పోస్తాడు. అయితే సెల్ఫోన్లు మాయంచేస్తూ నగరంలో విధ్వంసం సృష్టిస్తున్న పక్షిరాజా (అక్షయ్ కుమార్)ను చిట్టి ఒంటరిగా ఎదురించిందా? ‘2.ఓ’ రావల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అసలు పక్షిరాజాలా అక్షయ్ మారడానికి దారి తీసిన కారణాలు ఏంటి? అన్నది తెరపై చూడాల్సిందే.
ఎలా ఉందంటే:
శంకర్ ఎప్పుడూ సామాజిక నేపథ్యం ఉన్న కథల్ని ఎంచుకుని, వాటిని సాంకేతికంగా ఉన్నతంగా చూపిస్తుంటాడు. ఈసారి సాంకేతిక విషయాన్నే ఎంచుకోవడం మరింత కలిసొచ్చింది. 2.ఓ విషయంలో ఆయన సెల్ఫోన్లపై ఫోకస్ పెట్టాడు. సెల్ ఫోన్ల వల్ల వచ్చే శబ్దతరంగాల వల్ల ప్రకృతి ఎంత నష్టపోతోందో, భవిష్యత్తులో ఎన్ని వినాశాలు చూడాల్సి వస్తుందో… ఈ సినిమాలో కళ్లకు కట్టారు. వాటి చుట్టూ రజనీకాంత్ ఇమేజ్‌ని మ్యాచ్ చేసుకుంటూ ఓ కథ అల్లారు. ప్రధమార్ధంలో సెల్ ఫోన్ల మాయం, పక్షిరాజు చేసే విధ్వంసం వీటిపైనే దృష్టి పెట్టారు. ఎప్పుడైతే చిట్టి రంగ ప్రవేశం చేస్తాడో.. అప్పుడు ఓ రసవత్తరమైన పోరు చూసే అవకాశం దక్కుతుంది. పక్షిరాజుగా అక్షయ్ ని చూపించడంతో విశ్రాంతి కార్డు పడుతుంది.
ద్వితీయార్ధం మొత్తం చిట్టి – పక్షిరాజుల ఆధిపత్య పోరే చూపించారు. అసలు పక్షిరాజు కథేమిటి? ఎందుకు ఈ విధ్వంసం సృష్టిస్తున్నాడు? అనే విషయాల్ని ఫ్లాష్ బ్యాక్‌లో చెప్పారు. ఆ ఎపిసోడ్ హృదయాన్ని హత్తుకునేలా తెరకెక్కించాడు. అసలు ఈ సినిమాలో ఎమోషన్ పండింది అంటే… ఈ ఒక్క ఎపిసోడ్ లోనే. పతాక సన్నివేశాల్ని విజువల్‌గా ఓ స్థాయిలోకి తీసుకెళ్లాడు శంకర్. కొన్ని సన్నివేశాలు రోబోలో చూసినట్టే అనిపిస్తుంటాయి. రోబో నాటి ప్రభావం శంకర్‌లో ఇంకా పోలేదేమో అనే అనుమానం కలుగుతుంటుంది. ప్రచార చిత్రాలు చూసినవాళ్లకు ఈ సినిమా కథపై ఓ అవగాహన ఏర్పడి ఉంటుంది. వాటికి లోబడే సినిమా ఉంటుంది. కథ పరంగా.. దర్శకుడు అద్భుతాలేం చూపించలేదు. తన దృష్టంతా ఈ సినిమాని విజువల్ వండర్‌గా తీర్చిదిద్దడంపైనే సాగింది. కొన్ని సన్నివేశాల్లో గ్రాఫిక్స్ అబ్బురపరుస్తాయి. ఇంకొన్ని చోట్ల సాదాసీదాగా సాగాయి. అయితే… శంకర్ ఈసారి ఎమోషనల్ గా ఈ కథని మలచలేకపోయాడు. భావోద్వేగాలన్ని బలంగా రాబట్టుకొనే శంకర్… ఆ విషయంలో కాస్త లోటు చేశాడేమో అనిపిస్తుంది. రోబోలో ఐశ్వర్య రాయ్ లాంటి స్టార్ నాయిక ఉండడంతో ఆ పాత్రకు వెయిటేజ్ ఇవ్వగలిగాడు. ఈసారి… ఐష్ లోని లోటు స్పష్టంగా కనిపించింది.
బలాలు:
చిట్టి – పక్షిరాజు పోరాటాలు
విజువల్ ఎఫెక్ట్స్
ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్
భారీదనం
బలహీనతలు
షాకింగ్ ఎలిమెంట్స్ తక్కువ
ఎమోషన్స్‌లో ఇంకాస్త బలం ఉండాల్సింది.
రివ్యూ : 3.5 / 5
254 total views, 2 views today