సామాజిక కార్యకర్త రెహానా ఫాతిమా అరెస్టు…ఎందుకో తెలుసా..?

హిందువుల మనోభావాలను తన ఫేస్‌బుక్ పోస్టుల ద్వారా దెబ్బతీసినందుకుగాను సామాజిక కార్యకర్త రెహానా ఫాతిమాను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్ని వయస్సు మహిళలు శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి ప్రవేశించొచ్చని తీర్పు ఇచ్చిన నేపథ్యంలో రెహానా ఫాతిమా కూడా ఆలయంలోకి ప్రవేశించే ప్రయత్నం చేసింది. అయితే ఆమెను అయ్యప్ప భక్తులు అడ్డుకున్నారు.

సామాజిక కార్యకర్త రెహానా ఫాతిమాను పోలీసులు అరెస్టు చేశారు. కొచ్చిలోని పలరివట్టంలోని ఆమె కార్యాలయం నుంచి పోలీసులు అరెస్టు చేశారు. ఫేస్‌బుక్ పోస్టుల ద్వారా హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ రాధాకృష్ణ మీనన్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆమెపై సెక్షన్ 295ఏ కింద కేసు నమోదు చేశారు. అరెస్టు చేసి పటానమతిట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గతనెలలో ఫాతిమాతో పాటు మరో మహిళా జర్నలిస్టు అయ్యప్ప స్వామి కొండపైకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఫాతిమా హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ ఆమెను అరెస్టు చేయాలంటూ ఫిర్యాదులు వచ్చాయి.

రెహనా ఫాతిమా ముందస్తు బెయిల్ కోసం కేరళ హైకోర్టును ఆశ్రయించింది. బెయిల్ పిటిషన్‌ను విచారణ చేసిన హైకోర్టు బెయిల్ నిరాకరించింది. అంతేకాదు పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది. గతంలో కూడా ఫాతిమా కిస్ ఆఫ్ లవ్ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించారు.

54 total views, 1 views today