శరణుఘోష పై ఒకింత ఆశ్చర్యానికి లోనైన హైకోర్ట్

అయ్యప్ప దీక్ష అనగానే అందరికీ గుర్తొచ్చేది ‘స్వామియే శరణమయ్యప్ప’ అనే శరణు ఘోష! ఇరుముడి తలదాల్చి.. కొండలు, కోనల మధ్య వెళ్లే అయ్యప్పలకు అంతులేని విశ్వాసాన్నిచ్చి నడిపించేది శరణుఘోష ఇచ్చే బలమే!! అలాంటి శరణు ఘోషపైనా, భక్తులు బృందాలుగా వెళ్లడంపై నవంబరు 15 నుంచి కేరళ పోలీసులు ఆంక్షలు విధించారు. దీనిపై కొందరు భక్తులు ఆ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా.. ‘శరణు ఘోషపైనా ఆంక్షలా’ అని న్యాయస్థానం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. శబరిమల క్షేత్రంలో 144 సెక్షన్‌ను విధించింది యాత్ర సజావుగా సాగనివ్వడానికే తప్ప.. శరణు ఘోషను, భక్త బృందాలను అడ్డుకోవడానికి కాదని తేల్చిచెప్పింది.

భక్తులు స్వామి శరణు వేడుతూ, అయ్యప్ప కీర్తనలు పాడుతూ వచ్చే ప్రత్యేక క్షేత్రం శబరిమల అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పోలీసుల ఆంక్షల కారణంగా ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు వెనుదిరిగే పరిస్థితిని తీవ్రంగా పరిగణించింది. 144 సెక్షన్‌ ఎత్తివేతకు నిరాకరించిన హైకోర్టు.. భక్తులను మాత్రం అడ్డుకోవద్దని పోలీసులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు.. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి ప్రత్యేకంగా రెండు రోజులు కేటాయిస్తామని కేరళ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. కోర్టు తదుపరి విచారణను నవంబరు 28కి వాయిదా వేసింది. కాగా.. మహిళా భక్తులను శబరిమలకు తరలించే ఆలోచనేదీ లేదని సీఎం పినరయి స్పష్టం చేశారు.

62 total views, 1 views today