‘రంగు’ మూవీ రివ్యూ

నటీనటులు : తనీశ్‌, ప‌రుచూరి ర‌వి, ప్రియా సింగ్‌, ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు, పోసాని కృష్ణ‌ముర‌ళి, ష‌ఫీ, టార్జాన్‌, ర‌ఘు కారుమంచి, హ‌రిబాబు, త‌దిత‌రులు
దర్శకత్వం : కార్తికేయ‌.వి
నిర్మాత : ఎ.ప‌ద్మ‌నాభ రెడ్డి, న‌ల్ల అయ‌న్న నాయుడు
సంగీతం : యోగీశ్వ‌ర శ‌ర్మ‌

కథ :
బెజవాడ రౌడీయిజం చుట్టూ రంగు కథ తిరుగుతుంది. లారా అనే వ్యక్తి జీవితంలో సంఘటనల ఆదారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. లారా పాత్రను తనీష్‌ పోషించాడు. పవన్‌ కుమార్‌ అలియాస్‌ లారా(తనీష్‌) అనే కుర్రాడు చదువుల్లో స్కూల్‌ ఫస్ట్‌. అయితే కాలేజ్‌లో గొడవలు, కొన్ని పరిస్థితుల వల్ల పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లడం.. అటుపై రౌడీ షీటర్‌గా మారతాడు. అక్కడినుంచి సెటిల్‌మెంట్లు చేస్తూ.. ఎదుగుతూ ఉంటాడు. ఈ గొడవల మధ్యే తనకు పూర్ణ (ప్రియా సింగ్‌) అనే అమ్మాయితో ప్రేమా తరువాత పెళ్లి జరుగిపోతాయి. దీంతో జీవితంపై ఇష్టం ఏర్పడుతుంది. మళ్లీ మాములు మనిషిలా మారాలానుకుంటాడు. మరి అనుకున్నట్టుగా లారా మంచి వాడిగా మారిపోయాడా..? ఈ ప్రయత్నంలో లారాకు ఎదురైన సమస్యలేంటి..? ఈ కథలో ఏసీపీ రాజేంద్రన్ (‌పరుచూరి రవి), మణి (షఫీ)ల పాత్ర ఏంటీ? అసలు చివరకు ఏమైంది.. అనేదే ‘రంగు’ కథ.

ఎలా ఉందంటే :
కార‌ణాలు ఏవైనా క‌త్తి ప‌ట్టిన‌వాడు దానికే బ‌లికాక త‌ప్ప‌దని చెబుతుంటారు పెద్ద‌లు. అలాంటి విష‌యాన్ని చెప్పే క‌థే ఇది. నిజ జీవిత వ్య‌క్తులు, సంఘ‌ట‌న‌ల‌తో సినిమా తీస్తున్న‌ప్పుడు డ్రామా చాలా ముఖ్యం. ఏం జ‌రిగిందో మ‌క్కీకి మ‌క్కీ చూపిస్తాం అంటే అదొక డాక్యుమెంట‌రీ అవుతుంది త‌ప్ప సినిమా కాదు. ఇంట‌ర్ స్టేట్ ర్యాంక్ సాధించిన ఓ తెలివైన యువ‌కుడు ఎలా రౌడీయిజం వైపు మ‌ళ్లాడు? ప్రేమ‌లో ప‌డ్డాక ఎలాంటి మార్పు కోరుకున్నాడు? మారాక ఎలాంటి ప‌రిస్థితులు చోటు చేసుకొన్నాయి? అనే విష‌యాలు ఆస‌క్తిక‌ర‌మే. కానీ, క‌థ‌లో ఉన్న ఆ ఆస‌క్తి తెర‌పైకి తీసుకురావ‌డంలో విఫ‌ల‌మ‌య్యారు ద‌ర్శ‌కుడు. ఏసీపీ రాజేంద్ర పాత్ర ప‌రిచ‌య‌మ‌య్యాక ఆయ‌న రౌడీలకి కౌన్సిలింగ్ ఇచ్చే విధానం, వాళ్ల మార్పు కోసం చేసే ప్ర‌య‌త్నాలు కాస్త ఆస‌క్తిని రేకెత్తిస్తాయి మిన‌హా సినిమాలో చెప్పుకోద‌గ్గ విష‌యం అంటూ ఏమీ లేదు. మార్పు కోరుకొని ఉద్యోగం చేసుకొంటున్న లారాకి ఎదుర‌య్యే అనుభ‌వాలు, అత‌ను మ‌ళ్లీ సెటిల్‌మెంట్ల‌కి దిగ‌డానికి గ‌ల కార‌ణాలు, గ‌ర్భ‌వ‌తిగా ఉన్న భార్య‌ని చూడ్డానికి కూడా సాధ్యం కాని ప‌రిస్థితులు సినిమాకి కీల‌కం. కానీ ఆ సంద‌ర్భాల్ని కూడా సాదాసీదాగా చూపించ‌డంతో పాత్ర‌లన్నీ కీ ఇచ్చిన మ‌ర‌బొమ్మ‌ల్లా క‌నిపిస్తాయి. భావోద్వేగాల‌కి ఆస్కార‌మున్నా ఆ దిశ‌గా అస‌లేమాత్రం దృష్టిపెట్ట‌లేక‌పోయారు ద‌ర్శ‌కుడు. అలాగే ఏసీపీ పాత్ర‌లో హీరో ఛాయ‌లు క‌నిపిస్తాయి త‌ప్ప లారా పాత్ర మాత్రం మామూలుగానే అనిపిస్తుంది.

బ‌లాలు :
లారా, ఏసీపీ రాజేంద్ర పాత్ర‌లు
క‌థా నేప‌థ్యం

బ‌ల‌హీన‌తలు :
క‌థ‌, క‌థ‌నం
భావోద్వేగాలు పండకపోవడం

రివ్యూ : 2 / 5

150 total views, 1 views today