శబరిమలలో 69 మందిని అరెస్టు చేసిన పోలీసులు

శబరిమల ఉదంతంపై కేరళ మరోసారి భగ్గుమంది. శబరిమల ఆలయ సముదాయంలో పోలీసులు 69 మంది భక్తులను అరెస్టు చేసిన సంఘటనలపై రాష్ట్రం అట్టుడికింది. ఆదివారం రాత్రి మొదలైన ఆందోళనలు, నిరసనలు సోమవారం అంతకంతకూ తీవ్రరూపం దాల్చాయి. హిందూత్వ సంస్థల కార్యకర్తలు భాజపా, యువమోర్చా కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. ముఖ్యమంత్రికి సైతం సెగ తప్పలేదు. మరోవైపు సన్నిధానం వద్ద భక్తులతో పోలీసులు వ్యవహరించిన తీరుపై కేరళ హైకోర్టు మండిపడింది. ఉద్రిక్త పరిస్థితుల కారణంగా శబరిమల క్షేత్రానికి భక్తుల సంఖ్య తగ్గింది.

పోలీసుల నిర్బంధం, సౌకర్యాల లేమికి నిరసనగా ఆదివారం రాత్రి నుంచి పెద్దసంఖ్యలో భక్తులు సన్నిధానంలో అయ్యప్ప నామజపం చేస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో రాత్రివేళ సన్నిధానంలో ఉండేందుకు వీల్లేదని, వెళ్లిపోవాలని పోలీసులు ఆదేశించారు. భక్తులపై విరుచుకుపడ్డారు. పరిసరాల్లో నిద్రించకుండా నీళ్లు గుమ్మరించారు. 144 సెక్షన్‌ అమల్లో ఉందని, ముందస్తు జాగ్రత్తల పేరిట.. ఆలయ సముదాయంలో ఆదివారం రాత్రి 69 మందిని నిర్బంధంలోకి తీసుకున్నారు. సోమవారం ఉదయం వారిని అరెస్టు చేసి సాయంత్రం కోర్టులో హాజరుపరచగా, 14 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ విధించారు. శబరిమలలో భక్తులను నిర్బంధంలోకి తీసుకోవడం ఇదే తొలిసారి.
ఆదివారం రాత్రి నుంచే తిరువనంతపురంలో ఆందోళనకారులు ముఖ్యమంత్రి అధికార నివాసం ఎదుట నిరసనకు దిగారు. సోమవారం ఇద్దరు యువమోర్చా కార్యకర్తలు ముఖ్యమంత్రి వాహనశ్రేణి ముందుకు దూకారు. వారిద్దరినీ అరెస్టు చేశారు. మరోవైపు.. తన మనవలకు అన్నప్రాసన చేపట్టేందుకు శబరిమల వచ్చిన హిందూఐక్యవేదిక అధ్యక్షురాలు కేపీ శశికళకు పోలీసులు నోటీసు ఇచ్చారు. సన్నిధానంలో కేవలం ఆరు గంటలు మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు.

52 total views, 1 views today