ఎమ్మెల్యే పదవిని రద్దు…రూ. 50 వేలు జరిమానా

మతఘర్షణలు జరిగే విధంగా ప్రజలను రెచ్చగొట్టారని, శాంతిభద్రతలకు భంగం కలిగే విధంగా ఎన్నికల ప్రచారం చేశారని రుజువు కావడంతో ఇండియన్ యూనియన్ ముస్లీం లీగ్ (ఐయూఎమ్ఎల్) పార్టీ ఎమ్మెల్యే కేఎమ్. షాజీ శాసన సభ్యత్వాన్ని రద్దు చేస్తూ కేరళ హైకోర్టు శుక్రవారం సంచలన తీర్పు చెప్పింది.అంతే కాకుండా షాజీకి కోర్టు రూ. 50 వేలు జరిమానా విధించింది.2016లో కేరళలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసిన కేఎమ్. షాజీ ఎమ్మెల్యే అయ్యాడు. ఉత్తర కేరళలోని కణ్ణూరు జిల్లా ఆళీకోడ్ శాసన సభ నియోజక వర్గం నుంచి కేఎమ్. షాజీ, సీఎంపీ పార్టీకి చెందిన ఎంవి. నీకేష్ కుమార్ పోటీ చేశారు.

శాసన సభ ఎన్నికల్లో కేఎమ్. షాజీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మతవిధ్వేషాలు రెచ్చగొట్టే విధంగా, శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా షాజీ ఎన్నికల ప్రచారం చేసి ప్రజలను రెచ్చగొట్టి ఎన్నికల్లో విజయం సాధించారని నీకేష్ కుమార్ కోర్టును ఆశ్రయించారు.

షాజీ ఎన్నికల ప్రచారం చేసిన వీడియోలు, మీడియాలో వచ్చిన వీడియో క్లిప్పింగ్ లు కోర్టులో సమర్పించారు. అప్పటి నుంచి కేసు విచారణ జరుగుతోంది. షాజీ శాసన సభ సభ్యత్వాన్ని రద్దు చెయ్యాలని ఎన్నికల్లో ఓడిపోయిన ఎంవి. నీకేష్ కుమార్ కేరళ హైకోర్టులో మనవి చేశారు.

శుక్రవారం తుదివిచారణ పూర్తి చేసిన కేరళ హైకోర్టు న్యాయమూర్తి పీడీ. రాజన్ ఎమ్మెల్యే షాజీ శాసన సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అంతే కాకుండా ఎంవి. నికేష్ కుమార్ కోర్టు ఖర్చుల కోసం రూ. 50 వేలు చెల్లించాలని షాజీని కేరళ హైకోర్టు న్యాయమూర్తి పీడీ. రాజన్ ఆదేశించారు.

షాజీ శాసన సభ సభ్యత్వం రద్దు కావడంతో ఆళీకోడ్ శాసన సభ నియోజక వర్గంలో మళ్లి ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమీషన్ కు హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తాను మతవిధ్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎన్నికల ప్రచారం నిర్వహించలేదని, శాంతి భద్రతలకు భంగం కలిగించలేదని, హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ తాను సుప్రీం కోర్టును ఆశ్రయిస్తానని షాజీ మీడియాకు చెప్పారు.

33 total views, 1 views today