షేర్ల వ్యసనం…భార్య భర్తల ఆత్మహత్య

గుంటూరు జిల్లాకు చెందిన బత్తినేని బాపయ్య చౌదరి(31), అదే జిల్లాకు చెందిన శిరీష(27)కు నాలుగేళ్ల కిందట వివాహమైంది. ఈ దంపతులకు మూడేళ్ల పాప ఉంది. దంపతులిద్దరు గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగులు. బాపయ్యచౌదరి తనతో పాటు భార్యకు వస్తున్న జీతంతో సంతృప్తి చెందక షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాడు. క్రమేణా ఇది ఒక వ్యసనంగా మారింది. ఇటు జీతం సరిపోక తన పేరిట ఉన్న ఆస్తులు కూడా అమ్మేసుకున్నాడు. ఇంతటితో ఆగకుండా కట్నం కింద ఇచ్చిన భూమిని అమ్మేశాడు. మరోవైపు శిరీష షేర్‌ మార్కెట్‌ పెట్టుబడులపై భర్తను వారిస్తూనే ఉంది. అతడు ఆమె మాట పెడచెవిన పెట్టడంతో పాటు డబ్బు తీసుకురమ్మని వేధించసాగాడు. రోజురోజుకు భర్త వేధింపులు పెరగడంతో ఆమె తీవ్ర ఒత్తిడికి గురైంది. ఈ క్రమంలో.. బుధవారం దీపావళి పండుగ నిమిత్తం టపాకాయలు కొనుగోలు చేసేందుకు బాపయ్య ఇంటినుంచి వెళ్లాడు. ఒత్తిడిలో ఉన్న శిరీష ఇదే సమయంలో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాపయ్య ఇంటికి చేరుకునేసరికి భార్య ఉరివేసుకుని ఉండటంతో తన బావమరిదికి సమాచారం అందించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శవపరీక్ష నిమిత్తం మృతేదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆప్పటివరకు పోలీసులతో ఉన్న బాపయ్య ఆస్పత్రినుంచి కేపీహెచ్‌బీకి బయలుదేరాడు. మార్గమధ్యంలో సనత్‌నగర్‌ రైల్వేస్టేషన్‌ వద్ద ఆగాడు. తాను కూడా చనిపోతున్నానంటూ బావమరిదికి ఫోన్‌ చేశాడు. ఫలక్‌నుమా నుంచి లింగంపల్లి వెళుతున్న ఎంఎంటీఎస్‌ రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు.రెండు ఘటనలపై  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇలాఒక్కరోజే తల్లిదండ్రులిద్దరూ దూరం కావడంతో అభంశుభం తెలియని వారి మూడేళ్ల చిన్నారి ఒంటరైపోయింది. ఈ పరిస్థితి వారి బంధవులతో పాటు స్థానికులను కలచివేసింది.

53 total views, 2 views today