ప్రపంచంలోనే తొలిసారిగా ఏఐ న్యూస్‌ యాంకర్‌

ప్రపంచంలోనే తొలిసారిగా ఏఐ న్యూస్‌ యాంకర్‌తో వార్తలు చదివించింది చైనాకు చెందిన అధికారిక న్యూస్‌ ఛానల్‌ జిన్హువా.ఈ న్యూస్‌ యాంకర్‌ ఏ మాత్రం ఆలసిపోకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వార్తలను 24 గంటలు.. 365 రోజులూ అందిస్తాడని ఆ ఛానల్‌ సగర్వంగా ప్రకటించింది. ప్రస్తుతం తూర్పు చైనాలోని ఝెజియాంగ్‌ ప్రావిన్స్‌లో జరుగుతున్న ప్రపంచ ఐదో ఇంటర్నెట్‌ సదస్సులో ఈ ఏఐ న్యూస్‌ యాంకర్‌ను ఆ ఛానల్‌ ఆవిష్కరించింది.

అచ్చం మనిషిలాగే భావోద్వేగాలు వ్యక్తం చేస్తూ ఏఐ న్యూస్‌ యాంకర్‌ వార్తలు చదవడం విశేషం. ఈ న్యూస్‌ యాంకర్‌ని జిన్హువా న్యూస్‌ ఏజెన్సీ, చైనా సెర్చ్‌ ఇంజిన్‌ సొగోవ్‌.కామ్‌ సంయుక్తంగా రూపొందించాయి. మెషీన్‌ లెర్నింగ్‌ ద్వారా దీన్ని అభివృద్ధి చేశారు. ఏయే సందర్భాల్లో ఎలా ప్రవర్తించాలి, ముఖ కవలికలను ఎలా మార్చాలి తదితర అంశాల్లో తర్ఫీదునిచ్చారు. దీంతో తెరపై అచ్చం ఓ మనిషే వార్తలు చదువుతున్నాడన్న భావన కలుగుతుంది.

ఆ న్యూస్‌యాంకర్‌ తమ రిపోర్టింగ్‌ బృందంలో సభ్యుడిగా మారాడని.. 24 గంటలూ పనిచేస్తాడని జిన్హుహ తెలిపింది. తమ అధికారిక వెబ్‌సైట్‌, ఇతర సామాజిక మాధ్యమాల్లో అతని సేవలు వినియోగించుకుంటామని పేర్కొంది. ఖర్చులు తగ్గించుకోవడం.. సామర్థ్యాలను పెంచుకోవడంలో భాగంగా కృత్రిమ మేధను ఉపయోగించుకుంటున్నామని ఆ ఛానల్‌ వెల్లడించింది.

44 total views, 2 views today