హైదరాబాద్ లో పులివెందుల రౌడీలు

రాజధానిలో రౌడీయిజం మరోసారి పంజా విసిరింది. జూబ్లీహిల్స్‌లో సుభాష్‌ అనే స్థిరాస్తి వ్యాపారి వ్యాపారాల్లో తమకూ వాటా కావాలంటూ  మంగలి కృష్ణ అనుచరులు చంపేస్తామంటూ బెదిరించేందుకు వారం క్రితం అర్ధరాత్రి జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబరు 56లో సుభాష్‌ ఇంట్లో చొరబడ్డారు. ఇంటి ముందున్న కారు అద్దాలు, లైట్లు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై సుభాష్‌ జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించారు. నిందితుల్లో ఒకరిని కడప జిల్లా పులివెందులకు చెందిన సమీర్‌గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ‘‘విష్ణువర్దన్‌రెడ్డి, మోహన్‌, వీరబాబు, ప్రతాప్‌లతో కలిసి దాడికి పాల్పడ్డానని, తామంతా కడప జిల్లా పులివెందులకు చెందిన దంతులూరి కృష్ణ అనుచరులమని, ఆయన ఆదేశాల మేరకే దాడి చేశామని’’ అతను తెలపడంతో పోలీసులు అవాక్కయ్యారు. తర్వాత విష్ణువర్దన్‌రెడ్డిని విచారించారు. ఈ మేరకు కృష్ణ, అతని అనుచరులపై ఐపీసీ 427, 448 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, సమీర్‌, విష్ణువర్దన్‌రెడ్డిలను సోమవారం అరెస్ట్‌ చేశామని ఇన్‌స్పెక్టర్‌ గట్టు మల్లు వెల్లడించారు.

*చాకచక్యంగా వ్యవహరించి బెయిల్

తమపై కేసు నమోదు చేశారని తెలుసుకున్న కృష్ణ, మిగిలిన అనుచరులు మోహన్‌, వీరబాబు, ప్రతాప్‌ సహా గురువారం న్యాయస్థానంలో లొంగిపోయేందుకు వచ్చారు. ఆ సమాచారం తెలుసుకున్న పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వారిని అదుపులోకి తీసుకునేందుకు న్యాయస్థానం వద్ద మోహరించారు.  వారికి దొరక్కుండా నిందితులంతా న్యాయస్థానంలో లొంగిపోయి బెయిలు పొందారు. కోర్టు బయటకు వచ్చిన కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి వదిలేశారు.

 

34 total views, 1 views today