టాప్ బౌలర్స్‌కు రెస్ట్.. మూడో టీ20కి టీమ్ ఇదే

ముంబై: వెస్టిండీస్‌తో జరగబోయే మూడో టీ20లో ఆడే టీమ్‌ను ప్రకటించింది బీసీసీఐ. ఇప్పటికే సిరీస్ గెలవడంతో కీలకమైన బౌలర్లకు విశ్రాంతినిచ్చారు. ఉమేష్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, కుల్‌దీప్ యాదవ్‌లకు రెస్ట్ ఇచ్చినట్లు బోర్డు వెల్లడించింది. ఆస్ట్రేలియా టూర్‌కు ఈ ముగ్గురు బౌలర్లు మంచి ఫిట్‌నెస్‌తో ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. చివరి టీ20 మ్యాచ్ కోసం సిద్ధార్థ్ కౌల్‌ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఇక స్టాండిన్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మూడో టీ20లో మరో అరుదైన రికార్డుపై కన్నేశాడు. ఇప్పటికే ఇండియా తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా నిలిచిన రోహిత్.. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక పరుగుల వీరుడిగా నిలవడానికి కేవలం 69 పరుగుల దూరంలో ఉన్నాడు. రెండో టీ20లో సెంచరీ ద్వారా న్యూజిలాండ్‌కు చెందిన కొలిన్ మన్రో అత్యధిక సెంచరీల (3) రికార్డును రోహిత్ బీట్ చేసిన సంగతి తెలిసిందే. రోహిత్‌కిది నాలుగో సెంచరీ. ఇప్పుడు అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలవడానికి మరో న్యూజీలాండర్ మార్టిన్ గప్టిల్‌ను వెనక్కి నెట్టాల్సి ఉంది. ప్రస్తుతం రోహిత్ 2203 పరుగులతో రెండోస్థానంలో ఉన్నాడు. ఒకవేళ రోహిత్ ఈ ఘనత సాధిస్తే.. తొలిసారి అన్ని ఫార్మాట్లలో ఇండియాకు చెందిన ప్లేయర్సే టాప్ స్కోరర్లుగా ఉంటారు. టెస్టులు, వన్డేల్లో సచిన్ టెండూల్కర్ అత్యధిక పరుగులు సాధించిన విషయం తెలిసిందే.

మూడో టీ20కి టీమ్ ఇదే:
రోహిత్ శర్మ, ధావన్, రాహుల్, కార్తీక్, మనీష్ పాండే, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, కృనాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, షాబాజ్ నదీమ్, సిద్ధార్థ్ కౌల్

30 total views, 1 views today