లాస్‌ ఏంజిలెస్‌ బార్‌లో నౌకాదళ మాజీ ఉద్యోగి ఉన్మాదం

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్‌ ఏంజిలెస్‌ శివార్లలో ఒక బార్‌లో నౌకాదళ మాజీ మెరీన్‌ ఉద్యోగి కాల్పులకు దిగాడు. ఇందులో ఒక పోలీసు అధికారి సహా 12 మంది చనిపోయారు. మరో 21 మంది గాయపడ్డారు. కాలేజీ కుర్రకారుతో నిండిపోయిన దేశీయ మ్యూజిక్‌ బార్‌లో ఈ ఘటన జరిగింది. పోలీసులు రంగప్రవేశం చేయడంతో హంతకుడు తనను తాను కాల్చుకొని చనిపోయాడు. రెండువారాల కన్నా తక్కువ సమయంలో అమెరికాలో ఊచకోత జరగడం ఇది రెండోసారి.

లాస్‌ ఏంజిలెస్‌ నగరానికి 65 కిలోమీటర్ల దూరంలోని థౌజెండ్‌ ఓక్స్‌ విలాసవంతమైన ప్రాంతం. సాధారణంగా ఇక్కడ ప్రశాంత వాతావరణం ఉంటుంది. అక్కడి ‘బోర్డర్‌లైన్‌ బార్‌ అండ్‌ గ్రిల్‌’లో స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 11.20గంటలకు (భారత కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం 12.50 గంటలకు) ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ బార్‌ నిర్వాహకులు.. కాలేజీ విద్యార్థుల కోసం ‘వెడ్‌నెస్‌డే నైట్‌’ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వందల మంది యువతీ యువకులు హాజరయ్యారు. వీరిలో 18 ఏళ్ల వయసువారు కూడా ఉన్నారు. యువతీ యువకులంతా ఉల్లాసంగా ఆడుతూ పాడుతూ మస్తీలో మునిగి పోయారు. ఇంతలో.. 28 ఏళ్ల వయసున్న ఇయాన్‌ డేవిడ్‌ లాంగ్‌ బార్‌లోకి ప్రవేశించాడు. అతడు నల్లరంగు ట్రెంచ్‌కోటు, నల్ల చొక్కా, ఫ్యాంట్‌ ధరించి ఉన్నాడు. స్కార్ఫ్‌తో ముఖాన్ని కప్పేసుకున్నాడు.

వచ్చీరాగానే డేవిడ్‌ పొగ బాంబులు విసిరి, అయోమయం సృష్టించాడు. ఆ వెంటనే నల్లటి పిస్తోలును బయటకు తీశాడు. వెర్రిగా అరుస్తూ కాల్పులు జరిపాడు. అప్పటివరకూ కేరింతలతో ఉల్లాసంగా గడిపిన యువతీ యువకులు ఉలిక్కిపడ్డారు. ఆర్తనాదాలు చేసుకుంటూ ప్రాణాలు అరచేతపట్టుకొని తలోదిక్కుకు పరుగులు తీశారు. కొందరు తొలుత బాల్కనీ మీదకు, ఆ తర్వాత కిందకి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. కుర్చీలతో అద్దాలు పగులగొట్టి వాటి గుండా బయటపడ్డారు. కొందరు బాత్‌రూమ్‌లలో, బార్‌ పైకప్పులోను దాక్కొన్నారు.

కాల్పుల విషయం తెలియగానే.. పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. బార్‌ను చుట్టుముట్టాయి. వెంటూరా కౌంటీ షెరీఫ్‌ శాఖకు చెందిన సార్జంట్‌ రాన్‌ హెలస్‌, కాలిఫోర్నియా హైవే గస్తీ బృందానికి చెందిన ఒక అధికారి బార్‌లోకి ప్రవేశించారు. వారిపై హంతకుడు కాల్పులు జరిపాడు. రాన్‌కు అనేక తూటాలు తగిలాయి. తీవ్రగాయాల పాలైన అతడు ఆసుపత్రిలో చనిపోయాడు. 29 ఏళ్లపాటు సేవలు అందించిన ఆయన.. వచ్చే ఏడాది పదవీ విరమణ పొందాలనుకుంటున్నాడు. ఈ ఘటనలో ఆయనతోపాటు 12 మంది చనిపోయారు. బార్‌లోకి పోలీసులు ప్రవేశించడాన్ని చూసిన హంతకుడు తనను తాను కాల్చేసుకున్నాడు.

29 total views, 1 views today