మోదీ, రాహుల్‌ పర్యటనకు ఒక్కరోజు ముందు మావోయిస్టుల ఘాతుకం

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం దంతెవాడ జిల్లాలోని ఆకాష్‌నగర్‌-బచేలీ మార్గంమధ్యలో మావోయిస్టులు గురువారం బస్సును పేల్చివేశారు. ఈ ఘటనలో నలుగురు పౌరులు, ఓ సీఐఎస్‌ఎఫ్‌ జవాను మృతి చెందారు. మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. మెరుగు పరిచిన పేలుడు పదార్థం(ఐఈడీ)తో బస్సును పేల్చారు. 15 రోజుల వ్యవధిలో ఇది మూడో దాడి. జవాన్లు మార్కెట్‌ నుంచి సరకులు కొనుగోలు చేసి తమ శిబిరానికి బస్సులో తిరిగి వస్తుండగా బచేలీలోని పర్వత ప్రాంతంలో ఓ కొండ మలుపు వద్ద నక్సల్స్‌ శక్తిమంతమైన ఐఈడీని పేల్చినట్లు దంతెవాడ ఎస్పీ అభిషేక్‌ పల్లవ తెలిపారు. ఘటనలో జవాను  ముఖోపాధ్యాయతోపాటు, బస్సు డ్రైవర్‌ రమేష్‌ పాట్కర్‌, సహాయకులు రోషన్‌కుమార్‌ సాహు, జోహాన్‌ నాయక్‌, ట్రక్కు డ్రైవర్‌ సుశీల్‌ బంజారే మరణించారని, సతీష్‌, సురేష్‌ అనే జవాన్లు గాయపడ్డారని చెప్పారు. బస్సును ఎన్నికల విధుల్లో ఉన్న సీఐఎస్‌ఎఫ్‌ జవాన్ల కోసం కేటాయించారు. ఛత్తీస్‌గఢ్‌లోని 8 జిల్లాల్లో ఈ నెల 12న 18 అసెంబ్లీ స్థానాలకు తొలిదశ ఎన్నికలు జరగనున్నాయి. శుక్రవారం ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. వీరి పర్యటనకు ఒక్కరోజు ముందే ఈ ఘటన జరగడం గమనార్హం.

44 total views, 1 views today