ఉస్మానియాలో అరుదైన శస్త్రచికిత్స

అత్యంత అరుదైన శస్త్రచికిత్సలకు ఉస్మానియా ఆస్పత్రి కేరాఫ్ గా మారుతోంది.అరుదైన వ్యాధితో వచ్చిన పేషెంట్‌కు నెల రోజుగా అబ్జర్వేషన్‌లో ఉంటి సర్జరీ ద్వారా పునర్జన్మను ప్రసాదించారు యూరాలజీ విభాగం వైద్యులు.

మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన అంజలి(18) ఈ ఏడాది ఫిబ్రవరి 14న తన తండ్రితో కలిసి బైక్‌పై కొత్తూరు వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. అంజలి యూరోథెర(మూత్రనాళం) పూర్తిగా డ్యామేజ్‌ అవడంతో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో అత్యవసర చికిత్సలు నిర్వహించి ఆమె ప్రాణాలను కాపాడారు. ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఇన్ఫెక్షన్‌ సోకి మరింత ప్రమాదకరంగా మారడంతో గత నెల 5న ఉస్మానియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. అంజలికి పరీక్షలు నిర్వహించిన యూరాలజీ విభాగం హెచ్‌ఓడీ డాక్టర్‌ వెంకట శివరామకృష్ణ ప్రసాద్‌ వెంటనే అడ్మిట్‌ చేసుకున్నారు. ఇన్ఫెక్షన్‌ తగ్గేందుకు 22 రోజుల పాటు మందులు ఇస్తూ, అవసరమైన పరీక్షలు చేశారు. అం జలి శరీరం సర్జరీకి అనుకూలిస్తుందని భావించిన త ర్వాత గత నెల 27న సర్జరీ నిర్వహించారు. ‘క్రియేషన్‌ ఆఫ్‌ న్యూయో యూరథ్రఫ్రం యాంటీరియర్‌ ఒజనల్‌ వాల్‌’ సర్జరీని దాదాపు 3 గంటలు శ్రమించి చేశారు. యూరినల్స్‌ కోసం ట్యూబ్‌పై ఆధారపడిన అంజలిని యధాస్థితికి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. మరో రెండు వారాల తర్వాత డిశ్చార్చ్‌ చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. ఇలాంటి కేసు తన సర్వీసులో మొదటిదని డాక్టర్‌ శివరామకృష్ణప్రసాద్‌ తెలిపారు.

42 total views, 1 views today