ఓట్ల బదిలీ జరిగితే టీఆర్ఎస్ ఓడినట్లే

రాజకీయ విశ్లేషకులు రాష్ట్రంలో పరిస్థితులను అధ్యయనం చేసి ఫలితం ఇలా ఉండవచ్చని విశ్లేషి స్తుంటారు. సెఫాలజిస్టులు సర్వేలు చేసి ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చనేది అంచనా వేస్తుంటారు.జ్యోతిష్కులు జాతక చక్రాలు వేసి గ్రహస్థితులను బట్టి విజేత ఎవరో చెబుతుంటారు. అధికారంలో ఉన్న పార్టీలు ఇంటెలిజన్స్‌ అధికారులతో సర్వే చేయించి పరిస్థితిని తెలుసు కుంటుంటాయి. అయితే క్షేత్రస్థాయిలో సర్వే చేయక పోయినా కేవలం గణాంకాల విశ్లేషణ ద్వారా రాబోయే ఎన్నికల ఫలితాన్ని ఊహించి చెప్పే విధానమూ ఒకటి ఉంది. గత ఎన్నికల ఫలితాల తాలూకు గణాంకాలను ఆధారంగా చేసుకుని, తాజా పరిస్థితులకు అనుగుణంగా వాటికి కూడికలు-తీసివేతలు చేసి, గతానుభవాల ఆధారంగా ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావాన్ని బేరీజు వేసి… మొత్తమ్మీద ఫలితం ఇలా ఉండవచ్చని చెప్పవచ్చు. ఈ రకంగా చేసిన విశ్లేషణలు గతంలో నిజమైన సందర్భాలు అనేకం ఉన్నాయి.

తెలంగాణ ఎన్నికల ఫలితాలను ఈ దృష్టితో విశ్లేషించినప్పుడు ఎన్నో ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 34 శాతం ఓట్లు సాధించిన టీఆర్‌ఎస్‌ 63 సీట్లను గెలుపొంది అధికారంలోకి వచ్చింది. అంటే కేవలం మూడో వంతు ఓట్లు సాధించిన పార్టీ 53 శాతం సీట్లను గెల్చుకుంది. నాటి ఎన్నికల్లో అన్నిచోట్లా త్రిముఖ పోటీలు జరగడంతో తక్కువ ఓట్ల శాతంతోనే టీఆర్‌ఎస్‌ ఎక్కువ సీట్లు గెల్చుకోగలిగింది. చాలాచోట్ల కాంగ్రెస్‌, టీడీపీల మధ్య ఓట్లు చీలిపోవడం టీఆర్‌ఎస్‌కు కలిసివచ్చింది. అయితే అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. బద్ధ శత్రువులైన కాంగ్రెస్‌, టీడీపీలు ఒక్కటయ్యాయి. ఆనాడు ఒక్కటిగా ఉన్న టీడీపీ-బీజేపీలు ఇప్పుడు వేరుపడ్డాయి. ఆనాటి గణాంకాలను ఈనాటి పరిస్థితుల ప్రకారం విశ్లేషిస్తే… రాబోయే ఫలితం ఎలా ఉండవచ్చనేది కొంతవరకూ అంచనా వేయవచ్చు.

అయితే కొన్ని పార్టీలు కలిసి కూటమిగా పోటీ చేసినంత మాత్రాన వాటి మధ్య ఓట్ల బదిలీ పూర్తిగా జరుగుతుందని చెప్పలేం. తాము ఆశించిన సీటు పొత్తులో వేరే పార్టీకి వెళ్లిపోవడంతో అసంతృప్తి చెందే నాయకులు ఉంటారు. వారు తమ మిత్రపక్షం గెలుపునకు గట్టిగా ప్రయత్నం చేయకపోవచ్చు. కొందరు రెబెల్స్‌గా పోటీలోకి దిగవచ్చు. కొన్నిసార్లు వేర్వేరు పార్టీల కలయిక ప్రజలకే నచ్చకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల వల్ల కూటమి పార్టీల మధ్య ఓట్ల బదిలీ పూర్తిగా జరగదు. ఆ ప్రకారం మహా కూటమి పార్టీల మధ్య ఓట్ల బదిలీలో 6 శాతం గండిపడితే లెక్కల రీత్యా మహాకూటమికి ఉన్న ఆధిపత్యం తగ్గి టీఆర్‌ఎస్‌కు, మహాకూటమికి మధ్య హోరాహోరీ పోరు జరిగే అవ కాశం ఉంటుంది. ఒకవేళ 6 శాతానికి మించి ఓట్ల బది లీలో గండిపడితే అది టీఆర్‌ఎస్‌కు అనుకూలించవచ్చు.

అధికారంలో ఉన్న పార్టీపై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉండడం సహజం. అధికారంలోకి రాకముందు ఆ పార్టీ ఇచ్చిన హామీలు, వచ్చిన తర్వాత చేసిన పనుల్ని ప్రజలు బేరీజు వేసుకుంటారు. అంతేకాదు… ప్రభుత్వం ఇతరత్రా తమ ఆకాంక్షల్ని కూడా నెరవేర్చాలని కోరుకుంటారు. అధికారంలో ఉన్నవారి ప్రవర్తనను, వ్యవహార శైలిని అనుక్షణం గమనిస్తుంటారు. ఇవన్నీ సహజంగా అధికారంలో ఉన్న పార్టీపై ఎంతోకొంత వ్యతిరేకతకు దారితీస్తుంటాయి. చాలా ఎన్నికల్లో అధికార పార్టీలు ఓడిపోవడానికి ఇదే ప్రధాన కారణమవుతుంది. ఒకసారి అధికారంలో ఉన్న పార్టీ రెండోసారి మళ్లీ అధికారానికి వచ్చినప్పుడు కూడా దాని ఓట్ల శాతం ఎంతోకొంత తగ్గుతుంటుంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌నే తీసుకుంటే 1994 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ తిరిగి 1999 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయం సాధించింది. కానీ టీడీపీ ఓట్లు 5 శాతం మేర తగ్గాయి. అలాగే 2004లో గెల్చిన కాంగ్రెస్‌ 2009లో కూడా గెలుపొందింది. కానీ ఓట్లు 2 శాతం పైగా తగ్గాయి. అంటే రెండోసారి గెలుపొందినప్పుడు కూడా అధికార పార్టీ ఓట్ల శాతం తగ్గుముఖం పట్టింది. ఆ ప్రకారం టీఆర్‌ఎస్‌ ఓట్లు ఈసారి కనీసం 2 శాతంతగ్గుతాయని లెక్కవేసుకుంటే టీఆర్‌ఎస్‌ ఓట్ల శాతం 32కు పడిపోయే అవకాశం ఉంది. ప్రభుత్వంపై వ్యతిరేకత మరీ ఎక్కువగా కనుక ఉంటే టీఆర్‌ఎస్‌ ఓట్ల శాతం మరింత తగ్గి మహా కూటమికి బాగా అనుకూలించే అవకాశాలున్నాయి.

52 total views, 2 views today