చరిత్ర సృష్టించిన ‘తానా’

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ చరిత్ర సృష్టించింది. ఓహియోలో జరిగిన బాస్కెట్‌బాల్ గేమ్ ప్రారంభ వేడుకల్లో భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా భరతనాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు నిర్వహించి రికార్డులకెక్కింది. ‘ఇండియన్ నైట్’ పేరుతో నిర్వహించిన ఈ ప్రదర్శనలు బాస్కెట్‌బాల్ చరిత్రలోనే తొలిసారి కావడం విశేషం. క్విక్కెన్‌లోన్ ఎరీనా స్టేడియంలో క్లీవ్‌ల్యాండ్ క్యావలియర్స్, డెన్వర్ నగ్గెట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ సందర్భంగా ఈ ప్రదర్శన నిర్వహించారు. చిన్నారులు తొలుత అమెరికా జాతీయ గీతం పాడి.. ఆ తర్వాత నృత్యాలు ప్రదర్శించారు. మొత్తం 20వేలమంది ప్రేక్షకులు ఈ కార్యక్రమాన్ని తిలకించారు. నవంబర్ 1న జరిగిన ఈ కార్యక్రమం అన్ని జాతీయ ఛానళ్లలో ప్రసారమైంది.
ఈ సందర్భంగా తానా ప్రెసిడెంట్ సతీశ్ వేమన మాట్లాడుతూ.. తానా సరికొత్త చరిత్ర సృష్టించిందన్నారు. భారతీయ సంస్కృతిని పెంపొందించేలా కార్యక్రమాలు నిర్వహించడంలో ‘తానా’ తనకు తానే సాటని నిరూపించుకుందన్నారు. తానా ఉపాధ్యక్షుడు తాళ్లూరి జయ శేఖర్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని అమెరికాలోని మరిన్ని రాష్ట్రాల్లో నిర్వహించేలా చర్యలు చేపడతామన్నారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలు, విలువలను ప్రపంచానికి చాటడంలో ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ‘తానా’తో పాటు ‘నార్త్‌ఈస్ట్  ఒహియో తెలుగు సంఘం’ కూడా కార్యక్రమం నిర్వహణలో పాలుపంచుకుంది. ఈ సందర్భంగా ఆ సంఘం సభ్యులకు తానా సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు నేషనల్ బాస్కెట్ బాల్ అసోషియేషన్ కూడా ‘తానా’పై ప్రశంసలు జల్లు కురిపించింది. యువతను ప్రోత్సహించడంలో ‘తానా’ ముందుందని ప్రశంసించారు. ఈ కార్యక్రమ నిర్వహణలో తానా జాయింట్ ట్రెజరర్ కొల్లా అశోక్ కీలకపాత్ర పోషించారు.

56 total views, 2 views today