స్టాలిన్‌ను కలవనున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మళ్లీ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలంగా మారారు. ఇటీవల న్యూఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసిన ఆయన.. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కూటమిని ఏర్పాటు చేసేందుకు మంతనాలు జరుపుతున్నారు. ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఒకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్‌ను శుక్రవారం చంద్రబాబు కలవనున్నారు.

డీఎంకే వర్గాల సమాచారం ప్రకారం శుక్రవారం సాయంత్రం చెన్నైలోని స్టాలిన్ నివాసంలో ఆయనతో చంద్రబాబు భేటీ కానున్నారు. డీఎంకే కోశాధికారి ఎస్.దురైమురుగన్, ప్రధాన కార్యదర్శి టి.ఆర్.బాలు సహా పార్టీ సీనియర్ నాయకులంతా చంద్రబాబు-స్టాలిన్ భేటీలో పాల్గొంటారని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు వెల్లడించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటుచేసే కూటమిలో తాము చేరతామని తమ అధినేత ఇంతకు ముందే ప్రకటించారని చెప్పారు.

ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్, సీపీఎం నేతలు ప్రకాశ్ కారత్, సీతారాం ఏచూరి; సీపీఐ జాతీయ నాయకులు, ఎన్సీపీ అధినేత షరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ లీడర్ ఫరూఖ్ అబ్దుల్లా, జేడీ(ఎస్) వ్యవస్థాపకుడు దేవె గౌడతో పాటు ఇతర ప్రాంతీయ పార్టీల నేతలందరితోనూ చంద్రబాబు సంప్రదింపులు జరిపారని డీఎంకే నాయకుడు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సైతం చంద్రబాబు మాట్లాడరని, ఆమె పార్టీని కూటమిలో చేర్చాల్సిందిగా కోరారని స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే, స్టాలిన్‌ను కలవడానికి ఒక్కరోజు ముందే అంటే నేడు మాజీ ప్రధాని దేవె గౌడ, కర్ణాటక సీఎం కుమార స్వామిలను చంద్రబాబు కలవబోతున్నారు. ఈ మేరకు నేడు ఆయన బెంగళూరు వెళ్తున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు చంద్రబాబు బెంగళూరు బయల్దేరతారు. అక్కడ దేవెగౌడ, కుమార స్వామిలతో భేటీ అవుతారు. బీజేపీయేతర పార్టీల కూటమి, తాజా రాజకీయాలపై జేడీఎస్ నేతలతో చర్చిస్తారు.

38 total views, 1 views today