అమెరికా బ్యాలెట్ పోరులో భారతీయులు!

అమెరికా రాజకీయాల్లో భారతీయుల హవా కొనసాగుతున్నది. మంగళవారం జరుగనున్న ప్రతిష్ఠాత్మక మధ్యంతర ఎన్నికల్లో దాదాపు 12 మంది భారతీయ అమెరికన్లు బరిలో నిలిచారు. అమెరికాలో వలస వ్యతిరేక సెంటిమెంట్ తారాస్థాయికి చేరిన ప్రస్తుత దశలో బరిలో నిలిచిన వీరు ప్రత్యర్థులకు గట్టిపోటీని ఇస్తున్నారు. అమెరికా జనాభా 32.57 కోట్ల మందిలో భారతీయులు ఒక్క శాతం మాత్రమే. అమెరికా రాజకీయాల్లో భారతీయ అమెరికన్ల సంఖ్య పెరిగిపోతుండటం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నదని భారత్‌లో అమెరికా మాజీ రాయబారి రిచ్ వర్మ అన్నారు. పలువురు భారతీయ అమెరికన్ల తరఫున ప్రచారం చేసిన ఆయన.. ప్రస్తుత ఎన్నికలు పరివర్తనకు వేదికగా నిలుస్తాయన్నారు. ప్రస్తుతం ప్రతినిధుల సభలో సభ్యులుగా ఉన్న నలుగురు భారతీయుల విజయం నల్లేరుపై నడకేనన్నారు. వీరిలో మూడుసార్లు చట్టసభ సభ్యుడిగా ఉన్న అమీ బెరా కాలిఫోర్నియా 7వ కాంగ్రెషనల్ స్థానం నుంచి, రెండోసారి ఎన్నికలకు వెళ్తున్న చట్టసభ సభ్యులు రో ఖన్నా కాలిఫోర్నియా 17వ స్థానం నుంచి, రాజా కృష్ణమూర్తి ఇల్లినాయిస్ ఎనిమిదో స్థానం నుంచి, ప్రమీలా జయపాల్ వాషింగ్టన్ ఏడో స్థానం నుంచి పోటీలో ఉన్నారు.

వీరితోపాటు మరో ఏడుగురు కొత్త భారతీయ అమెరికన్లు బరిలో నిలిచారు. సెనేట్‌కు పోటీచేస్తున్న ఏకైక భారతీయుడిగా పారిశ్రామిక వేత్త శివ అయ్యదురై నిలిచారు. పలు అనధికారిక అంచనాల ప్రకారం.. ప్రస్తుతం అమెరికావ్యాప్తంగా జరుగుతున్న అన్నిరకాల ఎన్నికల్లో 100 మందికి పైగా భారతీయ అమెరికన్లు పోటీలో ఉన్నారు. ఈ ఏడాది దాదాపు 100 మంది భారతీయ అమెరికన్లు అన్నిస్థాయిల్లోని ప్రభుత్వ పదవులకు పోటీలో ఉన్నారు. వీరిలో కొంతమంది అమెరికన్ కాంగ్రెస్‌లోని రిపబ్లికన్ చట్టసభ సభ్యులను ఓడించి డెమోక్రాట్ల సంఖ్య పెరిగేలా చేయగలరు. భారతీయ అమెరికన్ల మద్దతు లభించడం మాకు గర్వకారణం అని డెమోక్రటిక్ పార్టీ జాతీయ కమిటీ అధికార ప్రతినిధి జాన్ సాన్‌టోస్ పేర్కొన్నారు. ఆరిజోనా, టెక్సాస్, ఓహియో, మిషిగాన్‌ల్లో మాకు గట్టి భారతీయ అమెరికన్ అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్‌లో మా సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నాం అని చట్టసభ సభ సభ్యుడు, డెమోక్రటిక్ పార్టీ నేత రాజా కృష్ణమూర్తి తెలిపారు. అమీ బెరా తొలిసారి చట్టసభకు ఎన్నికైనప్పుడు వచ్చే దశాబ్దిలో భారతీయ అమెరికన్ నేతల సంఖ్య రెండంకెల్లో ఉంటుందని అంచనా వేశారు. భారతీయ అమెరికన్లకు సేవ చేసే అవకాశం కల్పించాలంటే వారికి బయటకొచ్చి ఓటేయాలని మాజీ రాయబారి రిచ్ వర్మ పిలుపునిచ్చారు.

61 total views, 1 views today