టీ20ల్లో నెం.1 రికార్డ్‌కి చేరువలో రోహిత్..!

వెస్టిండీస్‌తో ఇటీవల ముగిసిన ఐదు వన్డేల సిరీస్‌లో రెండు భారీ శతకాలు బాదిన రోహిత్ శర్మ.. టీ20ల్లోనూ అరుదైన రికార్డుకి చేరువలో ఉన్నాడు. భారత్ జట్టు ఆదివారం నుంచి వెస్టిండీస్‌తో మూడు టీ20ల సిరీస్‌లో తలపడనుండగా.. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ మరో 186 పరుగులు చేస్తే టీ20ల్లో అత్యధిక పరుగులు చేసి బ్యాట్స్‌మెన్‌గా రికార్డుల్లో నిలవనున్నాడు. రేపు రాత్రి 7 గంటలకి ఈడెన్‌ గార్డెన్స్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది.

అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాని ఓసారి పరిశీలిస్తే..! న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ 2,271 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. షోయబ్ మాలిక్ (పాకిస్థాన్) 2,161 పరుగులు, బ్రెండన్ మెక్‌కలమ్ (న్యూజిలాండ్) 2,140 పరుగులు, విరాట్ కోహ్లి (భారత్) 2,102 పరుగులతో టాప్-4లో కొనసాగుతున్నారు. ఇక ఐదో స్థానంలో 2,086 పరుగులతో కొనసాగుతున్న రోహిత్ శర్మ మూడు టీ20ల్లో కలిపి 186 పరుగులు చేయగలిగితే..? అగ్రస్థానంలో నిలవనున్నాడు.

టీ20 సిరీస్ నుంచి కెప్టెన్‌ కోహ్లీకి విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు రోహిత్ శర్మకి జట్టు పగ్గాలు అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో.. రోహిత్‌కి కోహ్లీ నుంచి అగ్రస్థానం కోసం పోటీలేకపోయింది.

30 total views, 1 views today