రిషబ్ పంత్‌కి ఇదే మంచి ఛాన్స్: రోహిత్

భారత యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ తన సత్తా నిరూపించుకునేందుకు వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ చక్కటి అవకాశమని తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. రెగ్యులర్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీపై టీ20ల్లో వేటు వేసిన సెలక్టర్లు అతని స్థానంలో రిషబ్ పంత్‌కి జట్టులో చోటుచ్చిన విషయం తెలిసిందే. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం రాత్రి 7 గంటలకి తొలి టీ20 జరగనున్న నేపథ్యంలో.. ఈరోజు మీడియాతో రోహిత్ శర్మ మాట్లాడాడు. ఈ టీ20 సిరీస్‌ నుంచి కోహ్లీకి విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు.. జట్టు పగ్గాలని రోహిత్‌కి అప్పగించారు.

‘భారత్ జట్టులో గత కొన్నేళ్లుగా చాలా విలువైన ఆటగాడిగా ధోనీ కొనసాగుతున్నాడు. ఇప్పుడు అతను దూరమవడంతో మిడిలార్డర్‌లో అనుభవలేమి కనిపిస్తోంది. కానీ.. రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్‌‌లకి తమ సత్తా ఏంటో నిరూపించుకునేందుకు ఇదే మంచి ఛాన్స్. వచ్చే ఏడాది పరిమిత వనరులతో మేము ప్రపంచకప్‌కి వెళ్లాలని అనుకోవట్లేదు. అందుకే.. యువ ఆటగాళ్లని పరీక్షించి ప్రత్యామ్నాయాల్ని సిద్ధం చేసుకుంటున్నాం. రిజర్వ్ బెంచ్ బలంగా ఉంటే.. సులువుగా ఆటగాళ్లని భర్తీ చేసుకునే సౌలభ్యం లభిస్తుంది.’ అని రోహిత్ శర్మ వెల్లడించాడు.

31 total views, 1 views today