హెచ్1బీకి మరిన్ని ఆంక్షలు

హెచ్1బీ దరఖాస్తు నిబంధనలను అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది. ఈ మేరకు ఉద్యోగుల నియామక సంస్థల లేబర్ అప్లికేషన్ విధానంలో కొత్త ఆంక్షలు విధించింది. హెచ్1బీ వీసాల విషయంలో ట్రంప్ సర్కార్ కఠిన వైఖరితో అమెరికాలో ఉన్న చిన్న, మధ్య తరహా ఐటీ సంస్థల భవిష్యత్ అనిశ్చితిలో పడింది. దీనికితోడు తాజాగా మరిన్ని నిబంధనలను తెచ్చారు. అమెరికన్ల యాజమాన్యంలోని సంస్థలు తమ వద్ద ఎంతమంది విదేశీ ఉద్యోగులు పనిచేస్తున్నారనే వివరాలను ప్రభుత్వానికి వెల్లడించాలని, వాటి ఆధారంగా.. నూతన హెచ్1బీ దరఖాస్తులకు అనుమతిస్తామని స్పష్టంచేసింది. భారత ఐటీ నిపుణులు ప్రధానంగా హెచ్1బీ వీసాపైనే ఆశలు పెట్టుకుంటారు. ఈ వీసా ఆధారంగానే అమెరికన్ సంస్థలు మెరికల్లాంటి విదేశీ నిపుణులను నియమించుకుంటున్నాయి. స్థానికులకే అమెరికా ఉద్యోగాలు అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ తన హామీని నెరవేర్చేందుకు హెచ్1బీ వీసాల జారీ విధానంలో భారీ మార్పులకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అనేక ఆంక్షలు, నిబంధనలను ప్రభుత్వం విధించింది. ఏదైనా సంస్థ విదేశీ ఉద్యోగికి హెచ్1బీ వీసా ఇవ్వాలంటే, సదరు కంపెనీ తన లేబర్ అప్లికేషన్‌కు కార్మికశాఖ నుంచి అనుమతి పొందాలి.

ఇందుకు లేబర్ కండిషన్ అప్లికేషన్ ఫాంను సదరు సంస్థ కార్మికశాఖకు సమర్పించాలి. దరఖాస్తును పరిశీలించిన కార్మికశాఖ.. ఫలానా పోస్టు కోసం అర్హులైన స్థానిక ఉద్యోగి ఎవరూ లేనందున, విదేశీ నిపుణుడిని నియమించుకోవచ్చని హెచ్1బీ వీసా ఇచ్చేందుకు అనుమతినిస్తుంది. ఇందుకు సంస్థ తన వద్ద ఉన్న అన్ని పోస్టుల వివరాలను(విభాగాల వారీగా), స్వల్పకాలిక ఉద్యోగుల నియామక ప్రతిపాదనలను కూడా కార్మికశాఖకు అందజేయాలి. కంపెనీలు తమ వద్ద ప్రస్తుతం పనిచేస్తున్న విదేశీ నిపుణుల వివరాలను కచ్చితంగా సమర్పించాలని, వాటి ఆధారంగా నూతన హెచ్1బీ వీసాలను జారీ అంశాన్ని పరిశీలిస్తామని అమెరికా ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీచేసింది. అదనపు వివరాలతో కూడిన దరఖాస్తులు త్వరలోనే అందుబాటులోకి వస్తాయి. విదేశీకార్మికుల గుర్తింపు కార్యాలయం(ఓఎఫ్‌ఎల్‌సీ) వెబ్‌సైట్ నుంచి ఆ దరఖాస్తుల్ని కంపెనీలు పొందవచ్చు అని ఆ ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. 2017 నుంచి వీసా మోసాలపై చర్యలు తీసుకుంటున్న కార్మికశాఖ అంతటితో ఆగక.. విదేశీ నిపుణుల నియామకానికి అనుకూలంగా సంస్థలు ఉల్లంఘనలకు పాల్పడితే ఫిర్యాదు చేయాలని అమెరికన్ ఉద్యోగులను ప్రోత్సహిస్తున్నది.

థర్డ్‌పార్టీ కార్యక్షేత్రాల్లో విదేశీ ఉద్యోగులకు ప్రాధాన్యమిస్తున్న కంపెనీలను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం వరుసగా విధిస్తున్న ఆంక్షల్లో భాగంగానే లేబర్ అప్లికేషన్ విధానంలో మార్పులు చేసిందని సొసైటీ ఫర్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ సంస్థ విమర్శించింది. ప్రస్తుతం హెచ్1బీ వీసాల నిరాకరణ రేటు 40శాతం దాటిందని, ఫలితంగా చాలామంది ఐటీ నిపుణులు అమెరికా నుంచి వెళ్లిపోవడం చిన్న ఐటీ కంపెనీలకు శరాఘాతంగా మారిందని ఆ సంస్థ తెలిపింది. హెచ్1బీ వీసాల విషయంలో ప్రభుత్వ చట్టాలకు బదులుగా యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) సొంత నిబంధనలను అమలు చేస్తున్నదన్న విమర్శలు చాలారోజులుగా వినిపిస్తున్నాయి. చట్టాల్లో లేని విధానాలను అవలంబిస్తున్న యూఎస్‌సీఐఎస్.. మెమోలు, వెబ్‌సైట్లలో సవరణల ద్వారా నిబంధనలను ఇష్టారాజ్యంగా మార్చేస్తున్నదని చిన్న, మధ్యతరహా ఐటీ సంస్థలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఈ విషయమై ఐటీ సర్వ్ అలయన్స్ ఇప్పటికే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించింది.

52 total views, 1 views today