‘మంకీగేట్’ వివాదం తర్వాత నా కెరీర్ నాశన‌మైంది: సైమండ్స్

భారత్-ఆస్ట్రేలియా సిరీస్ అనగానే చర్చకొచ్చే అంశం ‘మంకీ గేట్‌’ వివాదం. దీని గురించి తెలియని క్రికెట్‌ ప్రేమికులండరు. 2008లో ఆసీస్ పర్యటనలో భాగంగా సిడ్నీ టెస్ట్‌లో హర్భజన్ సింగ్, ఆస్ట్రేలియా ఆటగాడు ఆండ్రూ సైమండ్స్‌ల మధ్య చోటుచేసుకున్న వివాదం అప్పట్లో క్రికెట్‌లో హాట్ టాపిక్. తాజాగా భారత్, ఆసీస్ మధ్య ట్వంటీ20, టెస్టు, వన్డే సిరీస్‌ల నేపథ్యంలో వివాదంపై సైమండ్స్ తీవ్ర స్థాయిలో స్పందించాడు.

పదేళ్ల తర్వాత మంకీ గేట్ వివాదంపై ఆసీస్ హార్డ్ హిట్టర్ సైమండ్స్ మాట్లాడుతూ.. ఆ వివాదమే తన కెరీర్‌ను నాశనం చేసిందన్నాడు. వాస్తవానికి సిడ్నీ టెస్టులో తనను హర్భజన్ కోతి అంటూ గేలిచేశాడని మరోసారి చెప్పాడు. మంకీ గేట్ తర్వాత జాతి వివక్ష వ్యాఖ్యలు తనను ఎంతగానో వేధించాయని, తన జట్టు అనవసరంగా విషయాన్ని పెద్దది చేసిందని అభిప్రాయపడ్డాడు.

‘మంకీ గేట్ వివాదం తర్వాత ఆల్కహాల్‌ ఎక్కువగా తీసుకోడం మొదలుపెట్టాను. దీంతో క్రమశిక్షణ లోపించింది. ఆటపై ఏకాగ్రత తగ్గింది. వివాదం తర్వాత నా కెరీర్ పతనం మొదలైంది. మద్యం తాగి తరచు ప్రాక్టీస్ మ్యాచ్‌లకు వెళ్లకపోవడం, జట్టుకు అందుబాటులో లేని కారణంగా 2009 జూన్‌లో ట్వంటీ20 టోర్నీ మధ్యలోనే ఆసీస్ బోర్డు కాంట్రాక్ట్ రద్దు చేసుకుని నన్ను ఇంటికి పంపించేసింది..

వాస్తవానికి హర్భజన్ నన్ను భారత్‌లో ఉన్నప్పుడే రెండు మూడు సార్లు కోతి అని పిలిచాడు. ఈ విషయంపై నేను డ్రెస్సింగ్ రూముకు వెళ్లి భజ్జీతో మాట్లాడాను. నన్ను మంకీ అని పిలిచి జాతి వివక్ష వ్యాఖ్యలు చేస్తే గొడవ పెద్దది అవుతుందని హెచ్చరించాను. అయినా సిడ్నీ టెస్టులో భజ్జీ నన్ను కోతి అంటూ పిలిచి అవమానించాడు. వివాదం నుంచి నేను కోలుకోలేకపోయానని’ సైమండ్స్ 2008లో జరిగిన మంకీ గేట్ వివాదంపై వివరించాడు.

కాగా, కోతి అంటూ సైమండ్స్‌ను గేలి చేశాడన్న ఆరోపణలతో తొలుత భజ్జీపై మూడు టెస్టుల నిషేధం విధించారు. అయితే సచిన్ సహా భారత జట్టు సిరీస్‌ను బహిష్కరిస్తామని హెచ్చరించడంతో నిషేధాన్ని ఎత్తివేసిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లో బాల్ ట్యాంపరింగ్ ఉదంతం నేపథ్యంలో ఆసీస్ జట్టు తీరును పలు క్రికెట్ దేశాల బోర్డులు వేలెత్తిచూపాయి.

32 total views, 1 views today